● కై కలూరులో పేట్రేగిపోతున్న అక్రమార్కులు
● ప్రశ్నించినందుకు వీఆర్వోపై దాడి
● విచారణ పేరుతో నాన్చుతున్న పోలీసులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కరువయ్యింది. దందాగిరి, మోసాలు, అక్రమ చెరువులు, మైనింగ్, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు కేరాఫ్ అడ్రాస్‌గా నిలిచిన కై కలూరు నియోజకవర్గం పరువు మరోసారి దిగజారింది. ఇందుకు ఉదాహరణగా మండవల్లి మండలం పులపర్రు శివారు దెయ్యంపాడు వద్ద బుధవారం వీఆర్వోపై జరిగిన దాడి ఘటన నిలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ పేరుతో నిందితులను అరెస్టు చేయడానికి కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
మండవల్లి మండలం పులపర్రు సమీపంలో దెయ్యంపాడు వద్ద ముంగర శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రభుత్వ మోటూరు చానల్‌ను అక్రమంగా పూడ్చేస్తున్నాడు. మండవల్లి తహసీల్దార్ గోపాల్‌కు సమాచారం రావడంతో వీఆర్వో వెంకటేష్‌ను పనులు నిలుపుదల చేయించాలని ఆదేశించారు. దీంతో వెంకటేష్ ఆక్రమణలు సమీపంలోనే నివసిస్తున్న శ్రీనివాసరావును పనులు ఆపాలని కోరారు. కోపంతో విచక్షణ కోల్పోయిన శ్రీనివాసరావు, అతడి భార్య సావిత్రి, సోదరుడు రాజు కలిసి చెప్పుతో వీఆర్వోపై ఏకధాటిగా దాడి చేశారు. అవమానభారంతో ద్విచక్రవాహనంపై వెళ్లిపోడానికి ప్రయత్నించిన వీఆర్వోపై మరోసారి దాడి చేయడానికి ప్రయత్నించారు. దాడికి గురైన వీఆర్వో కై కలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏడుకొండులు ఆశీస్సులు
ప్రభుత్వ స్థలం కనిపిస్తే కబ్జా చేసే ఓ దేవుడు పేరు పెట్టుకున్న అక్రమార్కుడి అండతోనే దాడి జరిగినట్టు అక్కడ ప్రజలు భావిస్తున్నారు. దెయ్యంపాడు సమీపంలో సదరు వ్యక్తి 20 ఎకరాలు చేపల చెరువు తవ్వుతున్నాడు. దీనిలో సుమారు 3 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని దాడికి గురైన వీఆర్వో వెంకటేష్ ఇప్పటికే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. మోటూరు చానల్‌ను పూడ్చేస్తున్నా శ్రీనివాసరావుకు మట్టి కూడా సదరు కబ్జాదారుడు నుంచే వెళుతోంది. నిత్యం కూటమి నేతల చుట్టూ తిరుగుతూ అక్రమ చెరువుల తవ్వకాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలకు అలవాటుపడిన వ్యక్తిని నాయకులు సైతం పక్కనే కూర్చోబెట్టుకోవడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు.
ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి
ముగ్గురు కలిసి వీఆర్వోను కొడుతున్నట్టు సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తున్నా విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం కేసు నమోదు చేశాం, చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కూటమి నేతలు కేసు నీరగార్చడానికి రంగంలోకి దిగారు. ఏదో ఆవేశంలో దాడి చేశామని బతిమలాడే ధోరణికి దిగారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగాలపై కూటమి నేతలు దురుసుగా ప్రవర్తిస్తున్నా ఘటనలు వెలుగు చూడటం లేదు. దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని రెవెన్యూ సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు.


