కలిదిండి(కై కలూరు): వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కలిదిండి మండల కాళ్ళపాలెంకు చెందిన పాశం నాగ సాయి మణికంఠ(31)కు కై కలూరు మండలం ఆటపాక గ్రామానికి చెందిన సౌజన్యతో 6 నెలల క్రితం వివాహమైంది. మణికంఠ చేపల చెరువులపై కూలీ పనులు చేస్తాడు. గురువారం మధ్యాహ్నం సమీప ఆరుతెగళపాడులో వాటర్ క్యాన్ తీసుకుని తిరిగి కాళ్ళపాలెం మోటార్‌సైకిల్‌పై వస్తుండగా, కలిదిండి నుంచి వరహాపట్నం వెళుతున్న వ్యాన్ నిర్లక్షంగా ఢీకొట్టింది. అనంతరం వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న మణికంఠ అక్కడికక్కడే మరణించాడు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని కాళ్ళపాలెం గ్రామానికి చెందిన అనేక మంది మణికంఠ మృతదేహంతో సహా రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు. దీంతో సర్కిల్ సీఐ వి.రవికుమార్ ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.


