మామిఢీలా | - | Sakshi
Sakshi News home page

మామిఢీలా

Apr 30 2026 8:49 AM | Updated on Apr 30 2026 8:49 AM

రోజురోజుకూ తగ్గుతూ..

ధర పడిపోయింది

నూజివీడు: ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మామిడి రైతులు నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. మామిడి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందనుకున్న మా మిడి రైతులు, తోటలు కొనుగోలు చేసిన వ్యాపారుల ఆశలు అడియాసలు అవుతున్నాయి. పండ్లలో రారాజుగా కీర్తిని సంపాదించుకున్న మామిడిని సాగు చేసిన రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. రోజురోజుకూ మామిడి ధరలు పతనమవుతుండటంతో ఏంచేయాలో తెలియని స్థితిలో రైతులు, వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు. మామిడి దిగుబడి ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో ధరలు బాగానే ఉన్నా రానురాను పతనమవుతూ రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. కాయలకు డిమాండ్‌ ఉన్నా ధర మాత్రం పెరగడం లేదు. ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కూడా మామిడి విస్తీర్ణం పెరగడంతో ఉత్తరాది ఢిల్లీ సేట్‌లు మామిడికాయల కొనుగోలుకు రాకపోవడమే ధర పెరగకపోవడానికి కారణమని రైతులు, తోటలు కాపునకు కొనుగోలు చేసిన వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని నూజివీడు, చింతలపూడి నియోజకవర్గంలో కలిపి మామిడి తోటలు 45 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఎక్కువగా బంగినపల్లి, తోతాపురి రకాలతో పాటు పెద్దరసం, చిన్నరసాలు ఉన్నాయి.

సీజన్‌ ప్రారంభంలో బాగున్నా..

మామిడి సీజన్‌ ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో ముంబై మార్కెట్‌లో బంగినపల్లి టన్ను రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల ధర పలికింది. క్రమేణా ఆ ధర కాస్తా రూ.60 వేలకు పడిపోయి ప్రస్తుతం రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య నడుస్తోంది.

దీంతో కిరాయిలు, కోత ఖర్చులు పోను రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కలెక్టర్‌ (తోతాపురి) పరిస్థితి సైతం అలాగే ఉంది. టన్ను ధర రూ.4 వేల నుంచి రూ.7 వేలు మాత్రమే లభిస్తోంది. దుక్కి ఖర్చులు, మందుల ఖర్చులు, కాపలా ఖర్చులు, కోత కూలి ఖర్చులు, ట్రాక్టరు కిరాయిలు పెరగడం, దిగుబడి పడిపోవడం, ధర తగ్గడంతో తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు, రైతులు లబోదిబోమంటున్నారు.

కమీషన్‌ దుకాణాల్లోనూ ధర తక్కువే..

మామిడి దిగుబడి లేనప్పటికీ స్థానికంగా ఏర్పాటుచేసిన కమీషన్‌ దుకాణాల్లో కూడా ధర తక్కువగానే ఉంది. ఆగిరిపల్లి మండలం ఈదర, ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం, విస్సన్నపేట, కొండపర్వలలో మామిడి కమీషన్‌ దుకాణాలున్నాయి. అక్కడ కూడా బంగినపల్లి టన్నుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల ధర మాత్రమే లభిస్తోంది. అలాగే తోతాపురికి కాయలు బాగుంటే టన్నుకు రూ.7 వేలు లభిస్తోంది. లోకల్‌ దుకాణాల్లో సూటు పేరుతో టన్నుకు 100 కిలోల కాయలను తీసుకోవడం, కమీషన్‌ 10 శాతం, వీటితో పాటు హమాలీ చార్జీలు తీసుకుంటుండటంతో రైతులకు మిగిలేది ఏమీ ఉండటం లేదు. విజయవాడ సమీపంలోని నున్న మార్కెట్‌కు కాయలను తరలించే వారే కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో నష్టాలను చవిచూస్తున్న మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

ఈ ఏటా నష్టాలే

పతనమైన బంగినపల్లి, కలెక్టర్‌ రకాల ధరలు

నష్టాల సుడిగుండంలో మామిడి రైతులు

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల డిమాండ్‌

మామిడి సీజన్‌ ప్రారంభంలో ఉన్న ధర ఆ తరువాత ఉండటం లేదు. రోజురోజుకూ ధర తగ్గిపోతుండటంతో పెట్టుబడులు కూడా వస్తాయో రావోనని ఆందోళన పెరుగుతోంది. రసాయన మందుల పిచికారీ, తోట కాపలా, ఇతర ఖర్చులు కలిపి పెట్టుబడులు తడిసి మోపెడవుతుండగా మామడికి మాత్రం ధర పెరగడం లేదు.

– పాలడుగు విజయకుమార్‌, తుక్కులూరు, నూజివీడు మండలం

ఈ ఏడాది మామిడి ధర పడిపోయింది. బంగినపల్లికి టన్నుకు రూ.15 వేల నుంచి రూ.25 వేలే ధర వస్తోంది. కలెక్టర్‌ రకం రూ.7 వేలు మాత్రమే పలుకుతోంది. గిట్టుబాటు ధర రాక ఏమి చేయాలో తెలియడం లేదు. కాపు తక్కువగా ఉండటంతో ధర ఎక్కువగా ఉంటుందని ఆశిస్తే పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.

– బాణావతు రాజు, లైన్‌తండా, నూజివీడు మండలం

Advertisement
 
Advertisement
Advertisement