ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజు బుధవారం రాత్రి నిత్య కల్యాణ మండపంలో జరిగిన ఎదుర్కోలు వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ఈ వేడుకను శ్రీవారి కల్యాణానికి ముందురోజు జరపడం సాంప్రదాయంగా వస్తోంది. ముందుగా స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి తొళక్క వాహనంపై నిత్య కల్యాణ మండపం వద్దకు అట్టహాసంగా తీసుకెళ్లారు. అక్కడ వెండి శేష వాహనంపై కల్యాణమూర్తులను ఉంచి హారతులిచ్చారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ అధికారులు, అర్చకులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు శ్రీవారి గుణగణాలను, ఆయన విశిష్టతను, రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను కొనియాడారు. వివాహానికి ముందురోజు వధూవరుల తరఫు బంధువులు శుభలేఖను పటించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలు ఉత్సవమని పండితులు తెలి పారు. ఉదయం హనుమద్వాహనంపై, రాత్రి వెండి శేషవాహనంపై జరిగిన తిరువీధి సేవలు ఆకట్టుకున్నాయి. ఆలయ ముఖ మండపంలో శ్రీనివాస కల్యాణం అలంకారంలో ఉన్న శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
బ్రహ్మోత్సవాల్లో నేడు
● ఉదయం సింహ వాహనంపై తిరువీధి సేవ
● రాత్రి 8 గంటల నుంచి కల్యాణోత్సవం
● శ్రీవారి ప్రత్యేక అలంకారం – మోహినీ
నేడు చినవెంకన్న తిరు కల్యాణోత్సవం
హనుమద్వాహనంపై స్వామి, అమ్మవార్లకు పూజలు
ఎదుర్కోలు ఉత్సవంలో స్వామి, అమ్మవార్లకు హారతులిస్తున్న అర్చకులు


