ఇళ్ల నిర్మాణాలు వేగిరపర్చాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణాలు వేగిరపర్చాలి

Apr 30 2026 8:49 AM | Updated on Apr 30 2026 8:49 AM

ఇళ్ల నిర్మాణాలు వేగిరపర్చాలి బాలికల హాస్టళ్ల తనిఖీ

ఏలూరు (టూటౌన్‌): పోలవరం ప్రాజెక్ట్‌ పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం, నిర్వాసితులకు భూపరిహారం, ప్రభుత్వ ప్రాజెక్టులకు భూసేకరణ తదితర అంశాలపై జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె సమీక్షించారు. నిర్వాసిత కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేసేందుకు, నిర్వాసితులను వెంటనే కాలనీలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులకు భూమికి భూమి పరిహారం అందించేందుకు, అవసరమైన భూములు సేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. నూజివీడు ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు భూసేకరణ పనులను వేగిరపర్చాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌, ఐటీడీఏ పీఓ రాములునాయక్‌, ఆర్డీఓ రమణ, భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

భీమవరం: పట్టణంలోని రైతు బజార్‌ సమీపంలో ఉన్న సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌ కాలేజీ బాలికల వసతి గృహాలను బుధవారం కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి సందర్శించారు. ఇటీవల కలెక్టర్‌ చొరవతో ఏర్పాటు చేసిన 10 సోలార్‌ లాంపుల పనితీరును పరిశీలించారు. సోలార్‌ లైటింగ్‌ వ్యవస్థ గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టోర్‌ రూమ్‌ను పరిశీలించారు. తాగునీటి కోసం ఒకటే కుళాయి ఉండటంతో ఇబ్బంది పడుతున్నట్టు బాలికలు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. మరో కుళాయి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సోషల్‌ వెల్ఫేర్‌ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి ఏవీ అరుణకుమారి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, వసతి గృహ సంక్షేమ అధికారి సీహెచ్‌ భానుమణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement