అనర్థాలను గుర్తించాలి
భీమవరం: వరి చేలలో ఎండుగడ్డి, వరి మోళ్లను తగలబెట్టడం వల్ల నేలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వేడి వల్ల మిత్ర కీటకాలు, శిలీంద్రాలు చనిపోయి పైరుకు నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. వరి సాగులో కూలీల కొరతను అధిగమించడానికి, సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి యంత్రాలను వినియోగిస్తున్నారు. వరికోత యంత్రాల ద్వారా మాసూళ్లు చేస్తున్న పంటలో వరిగడ్డి, మోళ్లను చేలలోనే తగలబెట్టడం పరిపాటిగా మారింది. వరిచేలలో గడ్డిని తగలబెట్టడం వల్ల అనేక అనర్థాలున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 5.40 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వరికోత యంత్రాలను ఉపయోగించడంతో వరిగడ్డిని గతంలో మారిదిగా రైతులు ఒబ్బిడి చేయడం లేదు. దీంతో యంత్రాలతో మాసూళ్లు చేసిన చేలలో గడ్డిని కొంతమంది రైతులు తగలబెడుతున్నారు. గడ్డిని తగలబెట్టే పద్దతి గతంలో కేవలం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో మాత్రమే ఉండేది.
గడ్డి తగలబెట్టడం వల్ల నష్టాలు
రైతులు పొలంలో గడ్డిని మండించడం వల్ల వేడి భూమిలో సుమారు సెంటీమీటరు లోతు వరకు వెళ్తుంది. దీనివల్ల భూములు నిర్జీవంగా మారిపోతాయి. వేడి వల్ల మిత్ర కీటకాలు, మిత్ర శిలీంద్రాలు చనిపోయి చీడపీడల ఉధృతి పెరిగిపోతుంది. టన్ను గడ్డిని తగులబెట్టడం వల్ల నేలలో 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల ఫాస్ఫరస్, 2.5 కిలోల పొటాషియం, 1.0 కిలోల సల్ఫర్‌తో పాటు నేల సేంద్రీయ కర్బనాన్ని కూడా కోల్పోతుందని పరిశోధనలో తేలింది. గడ్డిని తగలబెట్టడం ద్వారా వ్యాపించే పొగ వల్ల 76 శాతం మందికి కళ్ళ మంటలు, 44.8 శాతం మందికి ముక్కులో మంట, 45.5 శాతం మంది గొంతు నొప్పి బారిన పడినట్టుగా గుర్తించారు. గడ్డి తగలబెట్టడం వల్ల వచ్చే పొగను పీల్చడంవల్ల శ్వాస సంబంధ సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు.
ప్రస్తుతం పంట వ్యర్థాల సమర్ధ వినియోగంపై శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. మిగిలిన గడ్డిని కంపోస్టు చేయడం వల్ల ఎంతో విలువైన సేంద్రియ ఎరువు తయారవుతుంది. సేంద్రియ ఎరువులు పర్యావరణ హితమైనవే గాక సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. వరి గడ్డి పుట్టగొడుగుల పెంపకంలో బెడ్డింగ్ మెటీరియల్‌గా ఉపయోగపడుతుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు వరిగడ్డిని ఉపయోగించి ప్యాకింగ్ మెటీరియల్, కార్డ్ బోర్డ్‌లు, ప్లేట్స్, స్పూన్లు, బయో–ఇథనాల్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేస్తున్నందున గడ్డిని విక్రయించుకోవడం ద్వారా కొంత ఆదాయం పొందవచ్చు.
వరిగడ్డిని తగలబెడితే దుష్పరిణామాలు
వేడి వల్ల మిత్ర కీటకాలు, శిలీంధ్రాలు నాశనం
5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల ఫాస్ఫరస్ కోల్పోయే ప్రమాదం
చేలలో వరిగడ్డిని తగలబెట్టడం వల్ల అనేక అనర్థాలున్నాయి. గడ్డి తగలబె ట్టిన వేడి వల్ల భూమికే గాకుండా మనుషులకు తీవ్ర నష్టాలున్నాయి. గడ్డిని సమర్ధంగా వినియోగించుకోవడం వల్ల పర్యావరణానికి మేలు కలగడమేగాక రైతులు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చును. వరిగడ్డిని చేలలో దుక్కిదున్నడం వల్ల పైరుకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం


