పూరీ దర్శనంతో సమానం
ముదినేపల్లి (కై కలూరు): ముదినేపల్లి మండలం వడాలిలో సుభద్ర, బలరామ సమేత జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. దాదాపు 247 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దేశంలో శ్రీ కృష్ణ ఆలయాల రీతిలో ధ్వజ స్తంభంతో సహా ఇక్కడ దేవాలయం చూడవచ్చు. నాణ్యమైన కొయ్యతో ఎడమ జగన్నాథుడు, కుడివైపు బలరామస్వామి మధ్య సుభద్ర దేవీ ఇక్కడ భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. సప్త, స్వర్ణ శోభితంగా మకర తోరణాలు, పట్టు వస్త్రాలతో స్వామివార్లు ఆకర్షణీయంగా దర్శనమిస్తారు. మూలవిరాట్‌కు ముందు ఉత్సవ విగ్రహాలు కనిపిస్తాయి. మే 4 వరకు సుభద్రా బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామి, ప్రత్యామ్నాయ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్ల కల్యాణ మహోత్సవములు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు.
వడాలిలోని జగన్నాథ స్వామి దేవస్థానానికి చిన పూరిగా పేరు. ఇక్కడ దేవాలయం పూరి దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఇంచుమించు పూజా కార్యక్రమాలు సైతం ఒకేలా ఉంటాయి. రథోత్సవాన్ని గ్రామంలో నిర్వహిస్తారు. ఈ నెల 30న స్వామివారి కల్యాణం, మే 1న స్వామి రథోత్సవం, 4న అఖండ అన్నసమారాధన జరుగనుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విష్ణు సహస్ర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, హరికథ, కూచిపూడి, జానపద నృత్యాలు, కోలాటాలు, భక్త రంజనీ, పంచరత్నాలు, శ్రీలక్ష్మీ తిరుపతమ్మ బుర్రకథలను ఏర్పాటు చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఏడంతస్తుల రాజగోపురాన్ని నిర్మిస్తున్నారు.
రాష్ట్రంలో చిన పూరి క్షేత్రంగా ప్రసిద్ధి
వడాలిలో సుభద్రా బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామి దర్శనం పూరి జగన్నాథుడి దర్శనంతో సమానం. మే 4న అఖండ అన్నసమారాధన నిర్వహిస్తున్నాం. వేలాదిగా తరలిరావాలని కోరుతున్నాం.
–శింగనపల్లి శ్రీనివాసరావు, ఆలయ ఈవో


