ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి అన్నింటా ప్రథమ ర్యాంకు లభించింది. ప్రతి నెలా వాట్సప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? దేవాలయాల్లో త్రాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే ఈ నాలుగు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో ఏదొక అంశంలో ద్వారకాతిరుమల దేవస్థానానికి ప్రతి నెలా మొదటి ర్యాంకు లభిస్తోంది. గత నెల 26 నుంచి, ఈ నెల 26 వరకు జరిపిన సర్వేలో అన్నింటా చినవెంకన్న దేవస్థానం మొదటి ర్యాంక్ పొందింది.
దర్శనం ఇతర అంశాల్లో..
ద్వారకాతిరుమల 73.8 శాతంతో మొదటి ర్యాంక్ సాధించగా, శ్రీకాళహస్తి 73.7 శాతంతో రెండో ర్యాంక్, సింహాచలం 72.7 శాతంతో మూడో ర్యాంక్, కాణిపాకం 72.4 శాతంతో నాలుగో ర్యాంక్, అన్నవరం 72.3 శాతంతో ఐదో ర్యాంక్, విజయవాడ 71.3 శాతంతో ఆరో ర్యాంక్ సాధించగా, శ్రీశైలం 67.7 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది.
సౌకర్యాల కల్పనలో..
ద్వారకాతిరుమల 73.71 శాతంతో మొదటి ర్యాంక్, శ్రీకాళహస్తి 73.60 శాతంతో రెండో ర్యాంక్, సింహాచలం 72.62 శాతంతో మూడో ర్యాంక్, అన్నవరం 72.31 శాతంతో నాలుగో ర్యాంక్, కాణిపాకం 72.21 శాతంతో ఐదో ర్యాంక్, విజయవాడ 71.28 శాతంతో ఆరో ర్యాంక్, శ్రీశైలం 67.73 శాతంతో ఏడో ర్యాంక్ సాధించాయి.
మెరుగైన సేవల్లో శ్రీవారి దేవస్థానానికి మొదటి ర్యాంక్


