భీమడోలు: మండలంలోని సూరప్పగూడెం, పాతూరు గ్రామాల మధ్య ఉన్న రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరు మహిళలను గురువారం ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో సూరప్పగూడేనికి చెందిన వెజ్జు లక్ష్మీ(50), నిడమర్రు గ్రామానికి చెందిన సకినిశెట్టి సత్యవతి(59) మృతి చెందారని ఏలూరు రైల్వే ఎస్సై దానం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సూరప్పగూడెంలో ఆలయ ప్రతిష్ఠ వేడుకలు నిర్వహిస్తుండడంతో గ్రామస్తులు ఈ సంబరానికి బంధువులను ఆహ్వానించారు. ఈ క్రమంలో వెజ్జు లక్ష్మీ బంధువు నిడమర్రు మండలం సకినిశెట్టి సత్యవతి సూరప్పగూడెం వచ్చేందుకు పాతూరు గ్రామంలో బస్సు దిగింది. అక్కడ నుంచి సూరప్పగూడెం గ్రామంలోని ఆలయం వద్దకు రావడానికి చిరునామా తెలియక వెజ్జు లక్ష్మీకి ఫోన్ చేసింది. దీంతో ఆమెను తీసుకుని రావడానికి లక్ష్మీ పాతూరు వెళ్లి అక్కడ నుంచి సత్యవతిని వెంటబెట్టుకుని తీసుకుని వస్తుంది. ఈ క్రమంలో పాతూరు, సూరప్పగూడెం గ్రామాల మధ్య రైల్వే అండర్ ట్రన్నెల్ బ్రిడ్డి నుంచి వీరు రావాల్సి ఉండగా, వారిద్దరు ఇంటిని ముందుగా చేరుకునేందుకు మూసి ఉన్న రైల్వే గేటు పక్క నుంచి ట్రాక్ దాటుతుండగా అతివేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరికీ తలకు బలమైన గాయాలుతో పాటు చేతులు, కాళ్లు ఛిద్రంగా మారాయి. ఈ సమాచారం అందుకున్న ఏలూరు రైల్వే ఎస్సై దానం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఈ రెండు కుటుంబాలు పేద కుటుంబాలు కావడంతో పెద్ద దిక్కులను కోల్పోయమంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
వెజ్జు లక్ష్మీ(ఫైల్) సకినిశెట్టి సత్యవతి(ఫైల్)


