ప్రశ్నిస్తున్న కారుమూరిపై కేసుల పర్వం: సాయిబాబా రెడ్డి
తణుకు అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో జూదాలు, ఇతర అవినీతి మార్గాలనే కూటమి నేతలు తమ ఆదాయ వనరులుగా మార్చుకున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి విమర్శించారు. వీటిపై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును టార్గెట్ చేసి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయాలని తణుకు టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నేతలు తమ ఆనందం కోసం అదే నోటీసు పత్రాలను సిట్ అధికారుల వేషంలో వచ్చి కారుమూరి నివాసానికి అతికించి సంబరాలు చేసుకోవడం దారుణమని విమర్శించారు. కారుమూరిపై పెట్టిన కేసులకు ఆయన ఎప్పుడూ భయపడలేదని, ఇంట్లోని మహిళలపై కూడా కేసులు పెట్టడంపైనే ఆయన బాధపడ్డారని తెలిపారు.
అత్తిలి మండలం ఆరవల్లిలో టీడీపీ నాయకులు 50 మంది నిరుద్యోగులను నమ్మించి, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 3 కోట్లకు పైగా వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఆరవల్లిలోని టీడీపీ నాయకులే ఈ మోసంలో ప్రధాన పాత్ర పోషించి, మళ్లీ వారే పోలీసులకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
జూద కేంద్రంగా అత్తిలి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో తణుకు నియోజకవర్గాన్ని జూద కేంద్రంగా మార్చారని సాయిబాబారెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా అత్తిలిలో తాజాగా కూటమిలోని జనసేన నాయకులు క్రికెట్ బుకీలుగా అరెస్టు కావడం సంచలనం సృష్టించిందని, వారి వివరాలు పూర్తిగా బయటపెట్టకుండా స్థానిక ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. అత్తిలి టీడీపీ ప్రధాన నాయకుడి బంధువు ఇంట్లోనే పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని, తణుకు పట్టణంలో 12 ప్రాంతాల్లో పేకాట నిర్వహిస్తున్నారని, ఆ కమిషన్లతోనే పార్టీని నడపడం దౌర్భాగ్యమని విమర్శించారు. ఆరవల్లిలో టీడీపీ దౌర్జన్యాలను నిలదీస్తున్న వైఎస్సార్‌సీపీ నేత రొయ్యల చెరువులో విషప్రయోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ సేవలో పోలీసులు
ఆరవల్లిలో జరిగిన ఉద్యోగాల మోసానికి గురైన నిరుద్యోగుల సమస్యను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టుల కథనాలు ప్రశంసనీయమని సాయిబాబారెడ్డి కొనియాడారు. దువ్వ గ్రామంలో ఒక నిరుద్యోగికి ప్రజాప్రతినిధి సమక్షంలో సెటిల్‌మెంట్ చేసి డబ్బులు తిరిగి ఇచ్చారని, నవుడూరు బాధితులకు స్థలం రాసిస్తామని నమ్మబలికారన్నారు. ఉద్యోగాల మోసంపై వార్తలు రాసిన మీడియా ప్రతినిధులను పోలీసులు టార్గెట్ చేయడం వారి విధి నిర్వహణలోని లోపాలను చూపిస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి మోసం చేసినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి ఇబ్బంది కలగకుండా పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, నాయకులు జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, జంగం ఆనంద్‌కుమార్, పెనుమాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


