దాళ్వా కోతల నేపథ్యంలో రైతులకు ఇక్కట్లు
ఆకివీడు: రైతులకు సంచుల బెడద తీవ్రమైంది. దాళ్వా కోతలు ముమ్మరమవుతుంటే, ప్రభుత్వం రైతులకు సంచుల సరఫరాలో పూర్తిగా విఫలమైంది. రైస్ మిల్లర్లు సంచులను సరఫరా చేస్తారని చెప్పడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. సకాలంలో మిల్లర్లు సంచులు సమకూర్చలేకపోతున్నారు. ఆయా గ్రామాల్లోని రైతులకు కేటాయించిన మిల్లుల వద్ద నుంచి వచ్చే సంచులలో 60 శాతానికి పైగా చినిగినవి ఇవ్వడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. స్థానిక మాదివాడ ఆయకట్టులో రైతులు కోతలు ముమ్మరం చేశారు. అయితే చినిగిన సంచులతో సతమతమవుతున్నామని, ధాన్యం పూర్తిస్థాయిలో మిల్లులకు ఏ విధంగా చేరుతుందోనన్న భయంతో ఉన్నామని పలువురు రైతులు వాపోతున్నారు. పాత సంచులే ఇస్తున్నారని, వాటిలో చిల్లులు ఉన్న సంచులకు ప్యాచ్ వర్కులు వేసి సరఫరా చేయడంతో ధాన్యం నింపిన వెంటనే కారిపోతున్నాయని లబోదిబోమంటున్నారు. మరికొన్ని సంచులు చిన్నవిగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఒక్కో సంచిలో 45 కేజీల ధాన్యం నింపాల్సి ఉండగా, ఈ సంచుల నాణ్యత లేకపోవడం వల్ల కేవలం 35 నుంచి 40 కేజీలు మాత్రమే నింపుతున్నారు. దీనివల్ల అదనపు బస్తాలను వాడాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు కొత్త సంచులు సరఫరా చేసేవారని, కనీసం చిరుగులు లేని సంచులు సరఫరా చేస్తే ధాన్యం భద్రంగా ఉంటుందని రైతులు మొరపెట్టుకుంటున్నారు.
చిరిగిన సంచుల్లోనే ధాన్యం
చిల్లుల వల్ల కారిపోతున్న ధాన్యం


