20 నుంచి సప్లిమెంటరీకి దరఖాస్తు
బాలికల హవా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఏలూరు జిల్లాకు ఈ విద్యా సంవత్సరం సైతం చేదు అనుభవమే ఎదురైంది. గతంలో రాష్ట్ర స్థాయిలో చెప్పుకోదగ్గ స్థానాల్లో నిలిచిన జిల్లా, గత ఏడాది, అంతకుముందు ఏడాది ఫలితాల్లో నిరుత్సాహానికి గురిచేయగా, ఈ ఏడాది గత ఏడాది కంటే దిగజారింది. 2021–22లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రాష్ట్రస్థాయిలో 5వ స్థానంలో నిలిచిన జిల్లా, 2022–23లో ప్రథమ సంవత్సరంలో 2వ స్థానానికి, ద్వితీయ సంవత్సరంలో 3వ స్థానానికి ఎగబాకింది. 2023–24లో ప్రథమ సంవత్సరంలో 6వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. 2024–25 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 10వ స్థానానికి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 9వ స్థానానికి పడిపోయి పతనం దిశగా అడుగులు వేసింది. ఈ ఏడాది మరింతగా ప్రథమ సంవత్సరంలో 11వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 10వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ప్రథమ సంవత్సరం 12,283 మంది ఉత్తీర్ణత
జిల్లాకు చెందిన 17,555 మంది పరీక్షలు రాయగా 69.97 శాతంతో 12,283 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఎయిడెడ్ విద్యార్థులు 41 మందికి 14 మంది, ఏపీ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు 434 మందికి 384 మంది, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు 208 మందికి 194 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు 2,002 మందికి 1,014 మంది, హైస్కూల్ ప్లస్ విద్యార్థులు 398 మందికి 177 మంది, కస్తూరిబా బాలికా విద్యాలయాలకు చెందిన 72 మంది విద్యార్థినులకు 60 మంది, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు 14,328 మందికి 10,440 మంది ఉత్తీర్ణులయ్యారు.
ద్వితీయ సంవత్సరం 12,481 మంది ఉత్తీర్ణత
ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 16,345 మంది పరీక్షలు రాయగా 76.36 శాతంతో 12,481 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఎయిడెడ్ విద్యార్థులు 49 మందికి 19 మంది, ఏపీ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు 474 మందికి 441 మంది, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు 282 మందికి 202 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు 1,561 మందికి 1,016 మంది, హైస్కూల్ ప్లస్ విద్యార్థులు 307 మందికి 154 మంది, కస్తూరిబా బాలికా విద్యాలయాలకు చెందిన 55 మందికి 48 మంది, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు 13,617 మందికి 10,601 మంది ఉత్తీర్ణులయ్యారు.
జనరల్, ఒకేషనల్ వారీగా
జనరల్, ఒకేషనల్ విద్యార్థుల వారీగా ఫలితాలు పరిశీలిస్తే ప్రథమ సంవత్సరంలో 15,239 మంది జనరల్ విద్యార్థులకు 11,133 మంది ఉత్తీర్ణులు కాగా, 2,316 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,150 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 14,406 మందికి 11,298 మంది, 2,316 మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 1,150 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఈ పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 27తో గడువు ముగుస్తుందన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 20 నుంచి 27 వరకు సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సప్లిమెంటరీ ప్రయోగ పరీక్షలు జూన్ నెల 7 నుంచి జూన్ 11 వరకు, థియరీ సప్లిమెంటరీ పరీక్షలు మే నెల 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయన్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.
ఈ ఫలితాల్లో బాలికలు మరోసారి తమ సత్తా ప్రదర్శించారు. ప్రథమ సంవత్సరంలో 6,630 మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా బాలురు 4,503 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల్లో 6,988 మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా బాలురలో 4,310 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థుల్లో బాలికలు 827 మంది, బాలురు 323 మంది ఉత్తీర్ణులు కాగా, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థుల్లో బాలికలు 898 మంది, బాలురలో 285 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ ఫలితాల్లో దిగజారిన జిల్లా స్థానం
ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 11వ స్థానం
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 10వ స్థానం
బాలికలదే పైచేయి


