గృహావసరాలకు కొరత లేదు
జిల్లాలో మొత్తం 6,21,626 గ్యాస్ కనెక్షన్లకు గాను 4,02,335 జనరల్ కనెక్షన్లు కాగా, దీపం కనెక్షన్లు 1,83,183, ఉజ్వల కనెక్షన్లు 27,420, సీఎస్‌ఆర్ కనెక్షన్లు 8,528, ఐదు కేజీల కనెక్షన్లు 160 ఉన్నాయి. దీపం, ఉజ్వల కనెక్షన్లు చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ. ఒక్కో కుటుంబం సగటున ఏడాదికి ఏడు సిలెండర్లు వినియోగిస్తారని అంచనా. కాగా గ్రామీణ ప్రాంతాల్లో వంట వినియోగానికి కట్టెల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చిన్న కుటుంబాల్లో ఒక్కో సిలెండరు మూడు నుంచి నాలుగు నెలలు పైనే వస్తుంది. డెలివరీ బాయ్స్, ఏజెన్సీలు ఇలంఆటి వారికి కొంత మొత్తం చెల్లించి వీటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ కష్టాలతో విద్యుత్‌తో పనిచేసే ఇండెక్షన్‌న్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్లకు డిమాండ్ పెరిగింది. గ్యాస్ అయిపోతే వంట కష్టమేనని వినియోగదారులు హోల్‌సెల్, రిటైల్ దుకాణాలకు క్యూ కడుతున్నారు. కొద్దిరోజులుగా రూ.2000 నుంచి రూ.3000 మధ్యలో లభించే ఆయా గృహోపకరణాలకు డిమాండ్ పెరిగిందని హోమ్‌గూడ్స్ వ్యాపారులు చెబుతున్నారు.
భీమవరంలోని ఒక గ్యాస్ ఏజెన్సీకి బుధవారం 1800 వరకు గ్యాస్ బుకింగ్స్ రాగా ఆయిల్ కంపెనీ నుంచి 318 వరకు మాత్రమే సిలిండర్లు వచ్చాయి. జిల్లాలో రోజుకు దాదాపు 50 వేల వరకు బుకింగ్స్ వస్తుంటే 12,000 సిలెండర్లు డెలివరీ చేస్తున్నారు.
సాక్షి, భీమవరం : పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం గ్యాస్ సెగ పుట్టిస్తోంది. రోజువారీ సరఫరాకు అంతరాయం కలగడంతో హోటల్స్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధిక ధరలు చెల్లించి బ్లాక్‌లో సిలిండర్లు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో చిరు వ్యాపారులు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బజ్జీ వ్యాపారాలు మూసివేస్తుండగా మరికొందరు టిఫిన్స్, మీల్స్ ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు.
జిల్లాలో హెచ్‌పీసీఎల్‌కు చెందిన గ్యాస్ ఏజెన్సీలు 24, ఐఓసీఎల్ 20, బీపీసీఎల్ ఐదు ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 6,21,626 గృహావసరాలు (డొమెస్టిక్) కనెక్షన్లు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయేల్ – ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో 14.20 కిలోల డొమెస్టిక్ సిలెండర్‌పై రూ.60, 19 కిలోల కమర్షియల్ సిలిండర్లపై రూ.110 చొప్పున వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపిన విషయం విదితమే.
మూతపడుతున్న హోటళ్లు
జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు, బేకరీలు, కర్రీ పాయింట్లు, బజ్జీల బళ్లు తదితర వ్యాపారాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కొందరు వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తుండగా అధిక శాతం మంది వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లనే వాడుతున్నారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల మేరకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలి. గ్యాస్ కంపెనీలు సేల్స్ పెంచుకునే క్రమంలో ఇంతవరకు పరిమితి లేకుండా వినియోగదారులకు సిలిండర్లు డెలివరీ చేస్తూ వచ్చాయి. ఈ క్రమంలో డొమెస్టిక్‌వి దారి మళ్లించేందుకు వీలుండేది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. రెండు రోజుల క్రితం ఏడు వాణిజ్య సముదాయాల్లో అక్రమంగా వినియోగిస్తున్న 120 డొమెస్టిక్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని 6ఏ కేసులు నమోదు చేశారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడం, మరొపక్క డొమెస్టిక్ దొరక్క ఆయా వ్యాపారాల నిర్వహణ కష్టతరమవుతోంది. బ్లాక్ మార్కెట్‌లో డొమెస్టిక్ రూ.3 వేల వరకు, కమర్షియల్ రూ.5 వేలు వరకు అమ్మకాలు చేస్తున్నట్టు సమాచారం. అధిక ధరలు చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేయలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర చోట్ల ఆయా వ్యాపారాలు మూతపడుతున్నాయి. కొందరు వ్యాపారులు మీల్స్‌పై రూ.30 వరకు, టిఫిన్స్‌పై రూ.10 వరకు ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. కట్టెలు, ఊకల వినియోగానికి ప్రాధాన్యమిస్తుండటంతో వీటి ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు రూ.80 వరకు ఉన్న ఊక బస్తా ఇప్పుడు రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు,
పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు గ్యాస్ సెగ తగులుతోంది. కేటరింగ్ నిర్వాహకులు ముందుగా బుక్ చేసిన ఫంక్షన్‌లకు మాత్రమే వంటలు చేసి పంపుతున్నారు. కొత్త ఆర్డర్లు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.
జిల్లాలో గృహావసరాల కోసం వంట గ్యాస్‌కు కొరత లేదని అధికారులు చెబుతున్నారు. బుక్ చేసిన మూడు నాలుగు రోజుల్లోనే డెలివరీ అవుతున్నాయని తెలిపారు. జిల్లాలో ప్రతిరోజూ 12,000 డొమెస్టిక్ సిలిండర్లు డెలివరీ అవుతున్నాయని, అదనంగా మరో 35 వేల సిలిండర్ల కోసం ఆయిల్ కంపెనీలకు ఇండెంట్ పంపినట్టు అధికారులు తెలిపారు.
సిలిం‘డర్’
జిల్లాను వేధిస్తున్న గ్యాస్ కొరత
రోజువారీ బుకింగ్ 50 వేలు కాగా.. డెలివరీ 12 వేలు
బ్లాక్‌లో డొమెస్టిక్ రూ.3,000, కమర్షియల్ రూ.5,000 వరకు ..
గ్యాస్ కొరతతో మూతపడుతున్న హోటళ్లు, కర్రీ పాయింట్లు, వ్యాపారాలు
కట్టెలు, ఊకకు పెరిగిన డిమాండ్


