● ఉగాది కళారత్నాల్లో జిల్లాకు దక్కని చోటు
● ప్రభుత్వ నిర్లక్ష్యంపై కళాకారులు, సాహితీవేత్తల ఆగ్రహం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది వేళ ఏలూరు జిల్లాలోని కళాకారులు, కవులు, సాహితీవేత్తలకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఏడాది కళారత్న, ఉగాది పురస్కారాలకు ఏలూరు జిల్లా నుంచి అనేక మంది సీనియర్ కళాకారులు, సాహితీవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఏడాది కళారత్న పురస్కారాల్లో ఒక్కటీ ఏలూరు జిల్లాకు ఒక్కటీ రాకపోవడం ఆశావహులను నిరాశకు గురి చేసింది. దీనితో పరాభవ నామ సంవత్సరం వస్తూనే జిల్లాకు పరాభవం రుచి చూపిందని అంటున్నారు. కళారంగాన్ని నమ్ముకుని, భాష, సాహిత్యాల అభివృద్ధికి కృషి చేస్తున్న వందలాది మంది ప్రతిభావంతులు ఉన్నప్పటికీ, ఈ ఏడాది ‘కళారత్న’ పురస్కారాల్లో ఒక్కటీ దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పక్క రాష్ట్రాల వారికి ఇవ్వడంపై అసంతృప్తి
రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 40 మందిని ఈ ఏడాది ‘కళారత్న’ పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ఏడాది పురస్కారాల్లో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురుకి, తమిళనాడు కళాకారుడికి అవార్డులు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగువారి పండుగకు పక్క రాష్ట్రాల వారికి పురస్కారాలు అందించడమేంటని ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రాల వారికి పురస్కారాలు ఇవ్వాలంటే మరో సందర్భం చూసుకోవాలని, తెలుగు ప్రజల పండుగ నాడు తెలుగు కళాకారులకు పరాభవం చేయడం సరికాదంటున్నారు.
జిల్లా స్థాయిలోనూ నిరాశే..
ఈ ఏడాది కళారత్న పురస్కారాల్లో ఏలూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఏలూరు జిల్లాకు చెందిన వివిధ రంగాలకు చెందిన ఐదుగురికి కళారత్న అవార్డులు దక్కాయి. ఈ ఏడాది కనీసం ముగ్గురినైనా అవార్డులకు ఎంపిక చేస్తారని ఆశించగా ఆశాభంగం ఎదురయింది. రాష్ట్ర స్థాయి పురస్కారాల సంగతి పక్కన పెడితే, జిల్లా స్థాయిలోనూ ఉగాది వేడుకల సందడి ఎక్కడా కనిపించడం లేదు. గతంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారికంగా ఉగాది వేడుకలు నిర్వహించేవారు. పండితులు, కవులను సన్మానించడంతో పాటు నగదు పురస్కారాలు అందజేసేవారు. గత ఏడాది పురస్కారాలు ఇవ్వలేదు. తాజా ఏడాదికి సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లేకపోవడంతో కవులు, కళాకారులు నిరాశకు లోనయ్యారు.
గతంలో కాటంనేని భాస్కర్ కలెక్టర్‌గా పని చేసిన కాలంలో ఏటా జిల్లా స్థాయిలో ఉగాది వేడుకలు నిర్వహించేవారు. అదే సందర్భంలో ఆయా రంగాల వారికి పురస్కారాలు అందించేవారు. సుమారు 10 మంది ఆయా రంగాలకు చెందిన వారికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున నగదు పురస్కారం కూడా అందచేసేవారు. దీనికోసం జిల్లాలో సాంస్కృతిక మండలి చురుకుగా పని చేసేది. ప్రస్తుతం ఈ మండలి ఉనికిలోనే లేదు. అధికారులు కనీసం దీనిపై దృష్టి సారించడం లేదు. దీనివల్ల నిరుపేద కళాకారులకు ఎలాంటి తోడ్పాటు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ప్రతిభావంతుల జాబితాను పంపాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఏలూరు జిల్లా యంత్రాంగం ఈ విషయంలో విఫలమైంది.


