ఆగిరిపల్లిలో రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరు
సూరంపాలెం మెయిన్ రోడ్డుపై నిలిచిన నీరు
నూజివీడు/చాట్రాయి/ఆగిరిపల్లి : పట్టణంతో పాటు మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గత కొద్దిరోజులుగా ఎండలు మండుతున్న నేపథ్యంలో ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణంలోని పొట్టిశ్రీరాములు బొమ్మ సెంటర్‌లో నివాసముండే దొడ్డా కమలకుమారి ఇంటి పైభాగంలో పిడుగు పడింది. దీంతో చుట్టుపక్కల ఇళ్ల వారు భయంతో పరుగులు తీశారు.
చాట్రాయిలో భారీ వర్షం
మండలంలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. వడగళ్ల వాన పడింది. సూరంపాలెం పెట్రోలు బంకు ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. గ్రామాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. చనుబండ పాత దళితవాడలో టెలిఫోన్ టవర్ వద్ద కొబ్బరి చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల మిర్చి, మొక్కజొన్న తడిసిపోయాయి
ఆగిరిపల్లిలో ..
బుధవారం ఆగిరిపల్లి లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గంటకి పైగా వర్షం కురవడంతో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. ఆగిరిపల్లిలో 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం కురిసిన వర్షంతో మామిడి రైతులకు మేలు జరుగుతుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.


