ఫాస్ట్‌ఫుడ్ హోటల్‌పై దాడి
తాడేపల్లిగూడెం అర్బన్: పట్టణంలోని ఒక పాస్ట్‌ఫుడ్ హోటల్ నిర్వాహకులకు ఫుడ్ కొనుక్కోనేందుకు వచ్చిన యువకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ సెంటరులో హిబ్బు అనే వ్యక్తి కింగ్స్ ఫాస్ట్‌ఫుడ్ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11గంటల సమయంలో పెంటపాడుకు చెందిన ఇద్దరు యువకులు ఫాస్ట్‌ఫుడ్ కొనుగోలు చేశారు. కొనుగోలుదారులు మరో నిమ్మకాయ ఇమ్మని అడగడంతో హోటల్, లో పనిచేస్తున్న సిబ్బంది అక్కడ ఉన్నాయని తీసుకోమని చెప్పడంతో సిబ్బందికి యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కొంతసేపటికి హోటల్ నిర్వాహకులకు చెందిన వ్యక్తులు కొందరు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువకులపై తీవ్రంగా దాడి చేయడంతో చీర్ల వెంకటరెడ్డి కన్నుకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చీర్ల వెంకటరెడ్డిని వైద్యం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
గురువారం మళ్లీ దాడి
అయితే గురువారం సాయంత్రం గాయాలపాలైన చీర్ల వెంకటరెడ్డికి చెందిన పెంటపాడు, ముదునూరుపాడు ప్రాంతాలకు చెందిన వబంధువులు స్థానిక హోటల్ వద్దకు చేరుకుని హోటల్ యజమాని ఎక్కడని ప్రశ్నించగా అక్కడి సిబ్బంది తమకు తెలియదని చెప్పడంతో ఫుడ్ కొనుగోలు చేయడానికి వచ్చిన తమ వారిని ఎందుకు కొట్టారు? అని కోపంతో అక్కడి సిబ్బందిపై దాడి చేసి హోటల్‌లోని సామగ్రిని చెల్లాచెదురు చేశారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై నాగరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత వ్యక్తులను అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరరలించారు.
ఇరువర్గాలపై కేసుల నమోదు
హోటల్ నిర్వాహకులు మహ్మద్ అబ్దుల్, గాయాలపాలైన చీర్ల వెంకటరెడ్డిలతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఘర్షణలో చీర్ల వెంకటరెడ్డి వద్ద ఉన్న కొంత నగదును, అతని శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను హోటల్ నిర్వాహకులు దౌర్జన్యంగా లాక్కొన్నారని ఫిర్యాదు చేశాడు. తమ హోటల్ వద్ద గొడవ చేసి క్యాష్ కౌంటర్‌లోని నగదును చీర్ల వెంకటరెడ్డి బంధువులు కాజేశారని హోటల్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పట్టణ ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


