
గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్
కై కలూరు: వాహన తనిఖీల్లో ముగ్గురు యువకులు గంజాయి రవాణా చేస్తుండగా కై కలూరు రూరల్ పోలీసులు వారిని పట్టుకుని 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు స్థానిక పోలీసు స్టేషన్‌లో సీఐ వి.రవికుమార్ కేసు వివరాలను శనివారం వెల్లడించారు. కై కలూరు మండలం ఆలపాడు కోఆపరేటివ్ బ్యాంకు ఎదురు జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా శుక్రవారం ముగ్గురు యువకులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారన్నారు. వీరిలో భుజబలపట్నం శివారు సింగాపురం గ్రామానికి చెందిన గురివెల్లి బాలసాయి రామిరెడ్డి(27) వైజాగ్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న రోజుల్లో గంజాయికి అలవాటు పడ్డాడు. మలేషియా, హైదరాబాదు, విజయవాడ ప్రాంతాల్లో హోటళ్లలో పనిచేశాడు. ఇతను 2022లో అనకాపల్లి జిల్లా నాతవరం పోలీసు స్టేషన్‌లో గంజాయితో పట్టుబడిన కేసులో జైలు శిక్ష అనుభవించాడు. అలాగే ఇటీవల ఆకివీడులో ఇతని స్నేహితులు పవన్‌కుమార్ మరికొందరిని గంజాయి విక్రయాల కేసులో అరెస్టు చేశారు. చటాకాయి గ్రామానికి చెందిన జయమంగళ లక్ష్మీనారాయణ(26) డిగ్రీ వరకు చదివి కూలీపనులకు వెళుతూ మత్తుకు అలవాటు పడి గంజాయి విక్రయిస్తున్నాడు. కై కలూరు వెలంపేటకు చెందిన నరహరశెట్టి వెంకట అవినాష్(27) చైన్నెలో బీటెక్ చదువు మధ్యలో ఆపివేసి కై కలూరు లారీ ట్రావెల్స్‌లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఇతను కూడా గంజాయి మత్తుకు బానిసై డబ్బు కోసం ఇతరులకు విక్రయిస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీసీ) యాక్టు – 1985 ప్రకారం గంజాయి కేసులో 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందన్నారు. గంజాయి వివరాలు తెలిస్తే 1972, 112 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని సీఐ కోరారు. కార్యక్రమంలో రూరల్ ఎస్సై వి.రాంబాబు, ట్రైనీ ఎస్సై ఎం.హరిగోపాల్ పాల్గొన్నారు.
నిందితుల నుంచి 2.5 కిలోల గంజాయి స్వాధీనం