
మహిళలకు శాపంగా కూటమి పాలన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన మహిళల పాలిట శాపంగా మారిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వమే స్వయంగా మద్యం విక్రయాలు ప్రోత్సహించడం దారుణమన్నారు. విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పాటు చేయడంతోపాటు పర్మిట్ రూమ్‌లకు క్లియరెన్స్ ఇవ్వడం విచారకరమన్నారు. పెరుగుతున్న మద్యం వినియోగం చాలా కుటుంబాల్లో చిచ్చు పెడుతోందని, ఇది మహిళలకు తీరని వేదన మిగులుస్తోందన్నారు. రాష్ట్రం అంతటా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అంటూ ఎన్నికల మందు ఊదరగొట్టారని, ఒక ఏడాది ఈ పథకం పూర్తిగా ఎగ్గొట్టి, ఇప్పుడు అమలు చేస్తున్నామని చెబుతున్న దానిలో కూడా అనేక కొర్రిలు పెట్టారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, ఏలూరు నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు జుజ్జువరపు విజయనిర్మల, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసి, కార్పొరేటర్ డింపుల్ జాబ్, పోల్నాటి పరమేశ్వరి దేవి, మహిళా నేతలు పాల్గొన్నారు.