
దిగుబడి లేదు
ధర బాగున్నా..
గణపవరం: నిన్న మొన్నటి వరకూ రొయ్యకు ధర లేదు. సాగు గిట్టుబాటు కావడం లేదని, క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతులు రోడ్డెక్కారు. ఇప్పుడు రొయ్య ధర కనీవినీ ఎరుగని విధంగా పెరిగిపోయింది. 100 కౌంట్ రొయ్య ధర కిలో రూ.280 పలుకుతుంది. ఈ ధర రూ.300కు చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. రెండు వారాల కిత్రం కిలో రూ.220 పలికిన ఈ కౌంట్ ధర అమాంతం కిలో రూ.190కు పడిపోయింది. ప్రస్తుతం రొయ్య ధర రోజురోజుకు పెరిగిపోతూ రొయ్య రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. వారం వ్యవధిలోనే కిలో రూ.280కు చేరింది. ఈ ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రొయ్య ధర అమాంతం పెరిగిపోతుంది. ఇంకేముంది రొయ్య రైతులకు మంచి రోజులు వచ్చాయని అనుకుంటే పొరపాటే.. రొయ్య ధర పెరిగినా సాగులో ఉన్న చెరువులు మొత్తం వైరస్ దెబ్బకు ఖాళీ అయ్యాయి. ఏదో వేళ్ల మీద లెక్కపెట్టగలిగే అరకొరగా మాత్రమే రొయ్య సాగు జరుగుతుంది. అది కూడా ప్రస్తుతం చాలా తక్కువ కౌంట్ సైజులో మాత్రమే ఉంది. దీంతో ఽరొయ్యధర పెరిగినా తమకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
వైరస్ దెబ్బకు చెరువులు ఖాళీ
ఉమ్మడి జిల్లాలో 1.20 లక్షల ఎకరాలలో రొయ్య సాగు జరుగుతుండగా ప్రస్తుతం 25 శాతం చెరువుల్లో మాత్రమే సాగు జరుగుతుంది. గత వేసవిలో రైతులను ఆదుకోవాల్సిన సాగు చావు దెబ్బ తీసింది. అకాల వర్షాలు, వాతావరణ మార్పులతో తెగుళ్లు విజృంభించి చెరువులు ఖాళీ అయ్యాయి. కౌంట్‌కు రాకుండానే వేల ఎకరాలలో రొయ్యలను పట్టేసి అయినకాడికి అమ్ముకున్నారు. ఒక్కసారిగా 100 కౌంట్ రొయ్యధర రూ.225 నుంచి రూ.200కు పడిపోయింది. గత్యంతరం లేక రైతులు ఆ ధరకే రొయ్యలను అమ్ముకోక తప్పలేదు. వైరస్ దెబ్బకు ఖాళీ అయిన చెరువులలో జూలై నెలారంభం నుంచి మళ్లీ సీడ్ వేయడం ప్రారంభించారు. ఇంకా చాలా చెరువులు ఖాళీగానే ఉన్నాయి. బ్లీచింగ్, సున్నం వంటివి చల్లి ఆరపెట్టి ఉంచారు.
ఉంగుటూరు నియోజకవర్గం నాలుగు మండలాలలో రొయ్యసాగు సుమారు ఐదు వేల ఎకరాలలో సాగుతుంది. వేసవిలో వాతావరణ మార్పుల కారణంగా వైట్ స్పాట్ ఇతర వైరస్ వ్యాధులు విజృంభించడంతో 50 శాతం చెరువులు ఖాళీ అయ్యాయి. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల కారణంగా మిగిలిన చెరువులలో ఆక్సిజన్ సమస్యతో రొయ్యలను అర్థాంతరంగా పట్టేసి అయినకాడికి అమ్ముకున్నారు. నియోజకవర్గంలో ఎక్కవగా సన్న, చిన్నకారు రైతులే రొయ్యసాగు చేస్తున్నారు. వీరంతా వైరస్ వ్యాప్తితో ఈ పంట మొత్తం కోల్పోయి, నష్టాలు మూటకట్టుకున్నారు.
వైరస్ దెబ్బతో ఆక్వా చెరువులు ఖాళీ
లబోదిబోమంటున్న రొయ్య రైతులు
దిగుబడి బాగుంటే ధర ఉండదు
రొయ్య దిగుబడి బాగున్నప్పుడు ధరలు పతనమవుతాయి. చెరువులు ఖాళీ అయ్యాక ధరలు ఎగిసిపడతాయి. ఇది రొయ్య రైతుల దయనీయ పరిస్థితి. ఏడాది పొడవునా ఇదే పరిస్థితి. ఇది మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలం. ప్రస్తుతం జిల్లాలో వివిధ కారణాలతో 80 శాతం రొయ్యల చెరువులలో పట్టుబడులు చేసేశారు. ఇప్పుడు పెరిగిన ధరలు ఏ కొద్దిమంది రైతులకో తప్ప ఎక్కువ రైతులకు ఏ మాత్రం ఉపయోగపడవు. రొయ్యల ధర, మేతలు, మందుల ధరలపై ప్రభుత్వ పూర్తి నియంత్రణ ఉంటేనే రైతులకు ఉపయోగం.
–కాకర్ల వినాయకం, ఆక్వా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు

దిగుబడి లేదు

దిగుబడి లేదు