
స్మార్ట్ మీటర్లతో ప్రజలపై భారం
ఏలూరు (టూటౌన్): ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో మూడోరోజు గురువారం స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారని, సర్‌చార్జీల పేరుతో పైసా వసూలు చేయమని చెప్పి గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు సర్కారు ఈ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడారు. ర్యాలీ జిల్లా పరిషత్, ఇండోర్ స్టేడియం మీదుగా కోర్టు సెంటర్ నుంచి తిరిగి ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద ముగిసింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు అవుతున్నారన్నారు.