
జైళ్ల శాఖ పెట్రోల్ బంక్ ప్రారంభం
భీమవరం : పట్టణంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ సమీపంలో ఆధునికీకరించిన సబ్ జైలు, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్‌లను శుక్రవారం జైళ్ల శాఖ డీజీపీ అంజన్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం సబ్ జైల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఎస్పీ అద్నాన్‌నయీం అస్మి, ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య, వన్‌టౌన్ సీఐ ఎం.నాగరాజు ఉన్నారు.
జిల్లాలో ఎరువుల కొరత
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఖరీఫ్ రైతులు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులను అందుబాటులో ఉంచాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. శుక్రవా రం స్థానిక అన్నే భవనంలో ఆయన మాట్లాడు తూ రైతులకు యూరియా అందుబాటులో లే దని, దీంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనాల్సి వస్తోందన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎరువులు నిల్వల వివరాలను అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరత లే కుండా చూడాలని, లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఉపాధ్యాయు ల నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల అవార్డుల వేడుక నిర్వహించనున్నారన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. తర్వా త వచ్చే దరఖాస్తులు స్వీకరించరని పేర్కొన్నారు.
అధ్వానంగా ప్రభుత్వ హాస్టళ్లు
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభు త్వ హాస్టళ్లలో నిర్వహణ అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని వైఎ స్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అయినపర్తి రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జి ల్లాలోని పలు హాస్టళ్లను పరిశీలించిన అనంత రం శుక్రవారం కలెక్టరేట్‌లో డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడుకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ హాస్టళ్లలో పారిశుద్ధ్యం క్షీణించిందని, నేలపై నిద్ర, దోమల స్వైర విహారం సర్వ సాధారణమయ్యారన్నారు. పలు హాస్టళ్లలో దుప్పట్లు, దోమ తెరలు పంపిణీ చేయలేదని దీంతో విద్యార్ధులు కంటిపై నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మరుగుదొడ్లకు తలుపులు కూడా లేని దుస్థితి నెలకొందని, కనీస మౌలిక వసతులు కరువై విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారన్నారు. నిధుల కొరత కారణంగా మెనూ సక్రమంగా అమలవుతున్న దాఖలాలు లేవన్నారు. తరచూ ఆహారం కలుషితమై విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరిగేల అభిషేక్ అర్జున్, కార్యదర్శి జాన్సన్, ఉపాధ్యక్షుడు సూర్య, అనిల్, వివేక్, ప్రదీప్, ప్రభాష్, గణేష్ పాల్గొన్నారు.
పక్కాగా భూ సర్వే
భీమవరం(ప్రకాశంచౌక్): ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సర్వే నిర్వహించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ భూములు రీ సర్వేపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 293 గ్రామాలకు సంబంధించి 194 గ్రామాలు రీ సర్వే పనులను నెలాఖరుకు పూర్తిచేయాలన్నారు. మిగిలిన 72 గ్రామాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేసి నిర్ధారణ చేయాలన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని 72 గ్రామాల్లో 24,474 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు.

జైళ్ల శాఖ పెట్రోల్ బంక్ ప్రారంభం