
స్మార్ట్ మీటర్లు వద్దే వద్దు
ఏలూరు (టూటౌన్): ప్రమాదకర స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 5న విద్యుత్ భవనం వద్ద జరిగే ధర్నాలో ప్రజలు పాల్గొనాలని ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక పిలుపు నిచ్చింది. శుక్రవారం నగరంలోని పత్తేబాద రైతు బజార్ నుంచి ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉప్పులూరు హేమ శంకర్, సీఐటీయూ నాయకులు పంపన రవి మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మరింతగా దోచుకునే ఉద్దేశంతో స్మార్ట్ మీటర్లను తీసుకు వస్తుందన్నారు. ఏడాదిగా కరెంటు బిల్లులు పెరిగి ప్రజలు గగ్గోలు పెడుతున్నా చార్జీలు పెంచలేదంటూ కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.