
మర్యాదపూర్వక కలయిక
నూజివీడు: నూజివీడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బుధవారం మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ప్రతాప్ అప్పారావు జగన్‌ను కలిశారు.
గుడ్ టచ్– బ్యాడ్ టచ్‌పై అవగాహన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా శక్తి టీం సభ్యులు బుధవారం నగరంలోని పలు పాఠశాలల్లో, కాలేజీలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. శక్తి టీం సభ్యులు డ్రోన్ గస్తీ నిర్వహించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పాఠశాలలు, కళాశాలలు పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తూ, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై పర్యవేక్షణ కొనసాగించారు. వేధింపులు జరిగిన సందర్భంలో డయల్ 112, 181కు లేదా శక్తి టోల్ ఫ్రీ నెంబర్ 7993485111కు కాల్ చేయాలన్నారు.
ముగిసిన ట్రిపుల్‌ఐటీ కౌన్సెలింగ్
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో మూడు విడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి బుధవారం తుది విడత కౌన్సెలింగ్‌ను నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నిర్వహించారు. నాలుగు ట్రిపుల్‌ఐటీలలో కలిపి 143 సీట్లు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ చేసేందుకు ఒక్కో సీటుకు ముగ్గురు చొప్పున 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పొద్దుపోయే వరకు కొనసాగింది. 123 సీట్లు భర్తీ కాగా, 20 సీట్లు మిగిలాయి. కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పర్యవేక్షించారు.
నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష
పెనుగొండ: పెనుగొండలోని ఎస్వీకేపీ అండ్ కోట్ల వెంకట్రామయ్య బాలికోన్నత ఎయిడెడ్ పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు డీఈఓ అమలు చేసిన ఆన్‌లైన్ పరీక్షా విధానం నిబంధనలకు విరుద్ధంగా ఉందని పాఠశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ కే.రామచంద్రరాజు అన్నారు. బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ జీఓలో పేర్కొన్న మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు యాజమాన్యం గుర్తించిందన్నారు. పరీక్షా విధానం, అభ్యర్థుల జాబితా విడుదలకు సంబంధించి నేరుగా యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్‌లైన్ పరీక్షా ఫలితాలు, నియమాకాలు తుది తీర్పు వెలువడిన తరువాత మాత్రమే ప్రకటించాల్సి ఉందన్నారు.
పేద వర్గాలకు చేయూత నివ్వాలి
భీమవరం (ప్రకాశంచౌక్): పీ4లో భాగంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబరులో రైస్ మిల్లర్స్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో దిగువ పేద వర్గాల వారిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తమ వంతు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారన్నారు.

మర్యాదపూర్వక కలయిక