
స్మార్ట్ మీటర్లు వద్దు
ఏలూరు (టూటౌన్): విద్యుత్ చార్జీల నిలువు దోపిడీ ఆపాలి, ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు బుధవారం ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ నుంచి ఆర్‌ఆర్‌పేట మెయిన్ రోడ్డు వరకు ప్రజలతో సంతకాలు సేకరణ చేపట్టారు. సీఐటీయూ జిల్లా నాయకుడు పంపాన రవి, ఏఐటీయూసీ నేత ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ కరెంటు చార్జీలు పెంచే కార్యక్రమం ఉండదని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారని, ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని లోకేష్, చంద్రబాబు బాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట తప్పి నమ్మక ద్రోహం చేసిందన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని కుటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అదానీ వ్యాపారానికి మరింత భరోసా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పెను భారం మోపుతూ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రజలపై సర్దుబాటు భారం రూ.15,485 కోట్లు, ట్రూఅప్ చార్జీల పేరుతో రూ.3 వేల కోట్లు కూటమి సర్కారు మోపిందన్నారు. ఏపీ రైతు సంఘం కార్యదర్శి డేగ ప్రభాకర్, ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి మాట్లాడుతూ ఆగస్టులో ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో చేపట్టనున్న చలో విద్యుత్ భవన్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఐక్య కార్యాచరణ నాయకులు యర్రా శ్రీనివాసరావు, పల్లి గంగరాజు, ఈ శ్రీను, హనుమంత స్వామి, ఏఐటీయూసీ నాయకులు సాయన్న అభిలాష్ కుమార్, గొర్లి స్వాతి, ఉప్పులూరి లక్ష్మ తదితరులు పాల్గొన్నారు.