కూటమి పాలనలో ఆక్వా రైతుకుదేలు | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో ఆక్వా రైతుకుదేలు

Apr 7 2025 12:50 AM | Updated on Apr 7 2025 12:50 AM

కూటమి పాలనలో ఆక్వా రైతుకుదేలు

కూటమి పాలనలో ఆక్వా రైతుకుదేలు

కాళ్ల: రాష్ట్రంలో కూటమి నేతల చేతుల్లో ఆక్వా రంగం ఉండటంతో ఇష్టారాజ్యంగా ఆక్వా రైతులను దోచుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. మండలంలోని పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆక్వా సంస్థలను అడ్డం పెట్టుకుని సిండికేట్‌గా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టారిఫ్‌ల సాకుతో ధరలు తగ్గిస్తున్నారని విమర్శించారు. ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కూటమి నేతలకే కొమ్ము కాస్తోందన్నారు. ఆక్వా రైతులు కుదేలవుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది రైతులు ఆక్వారంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఫీడ్‌, సీడు, గిట్టుబాటు ధర విషయంలో రైతులు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారన్నారు. పది రోజులుగా అమెరికాలో నెలకొన్న పరిస్థితులతో ఆక్వా పంటను కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదని, ధరలు కిలోకు రూ.40 నుంచి రూ.50కి పడిపోయాయన్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.

రైతులకు అండగా నిలిచిన

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు అన్నివిధాలా అండగా నిలిచామన్నారు. కరోనా విపత్తు సమయంలో సాధికార కమిటీ ద్వారా ధరల నియంత్రణకు నాటి సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. లారీల్లో సరుకు రవాణాకు పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో పాలకులతో మా ట్లాడి అనుమతులు ఇప్పించామన్నారు. అలాగే ఫీడు, సీడు ధరలను నియంత్రించామన్నారు. యూనిట్‌ రూ.1.50కే సబ్సిడీపై విద్యుత్‌ అందించామన్నారు. ఇలా ఐదేళ్లలో విద్యుత్‌ సబ్సిడీ రూపంలో రైతులకు రూ.3,500 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఫిషరీస్‌ అసిస్టెంట్‌ను నియమించామన్నారు.

కూటమి సర్కారులో సిండికేట్‌దే రాజ్యం

కూటమి పాలనలో వ్యాపారులు సిండికేట్‌గా రై తుల పొట్టకొడుతున్నా కూటమి ప్రభుత్వం నియంత్రించడం లేదని ముదునూరి ఆరోపించారు. సిండికేట్‌ మొత్తం కూటమి నాయకులే కావడంతో ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎగుమతిదారులు, ఫీడు ఉత్పత్తి, తయారీదారులు, యాజమాన్యాలు ప్రభుత్వ అండదండలతో నడుస్తున్నారనే భావన రైతుల్లో ఉందన్నారు. అలాగే ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ పేరుతో విద్యుత్‌ సబ్సిడీలను తగ్గించారన్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు చార్జీల పేరుతో రైతులను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 50 కౌంట్‌ వరకు మాత్రమే అమెరికాకు ఎగుమతి అవుతున్నా 70 నుంచి 100 కౌంట్‌ వరకు ధరలు తగ్గించడం దారుణమన్నారు. ఆక్వా రైతులకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలుస్తుందని, వారి పక్షాన పోరాటం చేస్తుందని ముదునూరి తెలిపారు. సీడు, ఫీడు ధరల నియంత్రణ, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

సిండికేట్‌గా దోపిడీ

టారిఫ్‌ల సాకుతో ధరల తగ్గింపు

వైఎస్సార్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement