ముస్లింలకు చంద్రబాబు దగా
నూజివీడు: ముఖ్యమంత్రి చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికి ముస్లింలను మోసం చేశారని వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ యూనస్పాషా(గబ్బర్) అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ముస్లింలపై కపట ప్రేమ చూపుతున్నారన్నారు. దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల అభ్యున్నతికి కృషి చేశారని, వైఎస్సార్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, జగన్మోహన్రెడ్డి వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారన్నారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వక్ఫ్ చట్టానికి టీడీపీ, జనసేనలు మద్దతు తెలపడం దారుణమన్నారు. ముస్లిం విభాగం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 లక్షల మంది ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకు చంద్రబాబు పూనుకోవడం గర్హనీయమన్నారు. కౌన్సిలర్ మీర్ అంజాద్ ఆలీ, నాయకులు షేక్ మస్తాన్ వలీ, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, ముస్లిం నాయకులు మహ్మద్ ఆలీ, షేక్ షాజహాన్, సలీం, ఆమీర్ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.


