షేడ్స్‌ ఆఫ్‌ రెడ్‌!

Vardhelli Murali Article On Senior Maoist Leader Akkiraju Haragopal - Sakshi

జనతంత్రం

మనం జనజీవన స్రవంతిగా పిలుచుకునే లోకంలో ఆర్కే అనే పేరు అంత సుపరిచితమైనదేమీ కాదు. అధికార పదవుల్లో చక్రం తిప్పిన వ్యక్తి కాదు. వ్యాపారాలు చేసి వేలకోట్ల టర్నోవర్‌ సాధించడం వంటి ఘనతలేమీ లేవు. చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం వారిచ్చే ‘పద్మశ్రీ’ బిరుదు రాలేదు. ప్రైవేట్‌వాళ్లు బహూకరించే ‘సేవారత్న’ కూడా లేదు. జీవన సాఫల్య పుర స్కారం లేనేలేదు. అయినప్పటికీ ఆయన మరణవార్తకు తెలుగు మీడియా తగిన ప్రాధాన్యమిచ్చింది.

గుంటూరు జిల్లాకు చెందిన ఒక స్కూల్‌ టీచర్‌ పెద్దకొడుకు అక్కిరాజు హరగోపాల్‌ ఉరఫ్‌ ఆర్కే. వరంగల్‌ ఆర్‌ఈసీ (ప్రస్తుతం ఎన్‌ఐటీ)లో ఇంజనీరింగ్‌ చదివాడు. అప్పట్లో తెలి వైన విద్యార్థులకే ఇంజనీరింగ్‌లో సీటు దొరికేది. ఆర్‌ఈసీలో ఆ సీటు సంపాదించడమంటే మరింత నాణ్యమైన సరుకని అర్థం. ‘జనజీవనస్రవంతి’లోనే అతను కొనసాగి ఉన్నట్లయితే ‘నాణ్య మైన’ జీవితాన్నే గడిపి ఉండేవాడు. జీవన సాఫల్య పురస్కారా ల్లాంటివి కూడా లభించి ఉండేవేమో!

ఆ రోజుల్లో ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థులపై కమ్యూనిస్టు తీవ్రవాద భావజాల ప్రభావం బలంగా ఉండేది. చేగువేరా వేగుచుక్కలా కనిపించేవాడు. జార్జిరెడ్డి ఆదర్శం ఉత్తే జితం చేసేది. వందలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆ బాట వెంట పయనమయ్యారు. ఉద్యోగాలు, విలాసవంత మైన జీవితావకాశాలను తృణప్రాయంగా వదిలేశారు. వారిలో ఆర్కే ఒకరు.

సమష్టిగా ప్రజలందరికీ చెందవలసిన భూమి, ప్రకృతి, సహజ వనరులపై కొందరి పెత్తనమేమిటనే ప్రశ్నలోంచే కమ్యూ నిస్టు సిద్ధాంతం పుట్టింది. ఆ కొంతమంది వ్యక్తుల ‘దోపిడీ’ కారణంగానే అత్యధిక ప్రజానీకం పేదరికంలో మగ్గవలసి వస్తున్నదని అది నిర్ధారించింది. అటువంటి ‘దోపిడీ వ్యవస్థ’ను కూలదోసి, సమసమాజాన్ని ఏర్పాటుచేసే మార్గాలను ఉపదేశిం చింది. అనుసరించవలసిన ఆ మార్గాలపై ఏర్పడిన భిన్నాభిప్రా యాల ఫలితంగా పార్లమెంటరీ కమ్యూనిస్టులూ, విప్లవ కమ్యూనిస్టులుగా చీలిపోయారు. ఈ రెండు భాగాల్లోనూ మరో రెండు డజన్లకు పైగా చీలికలున్నాయి. విప్లవ కమ్యూనిస్టుల్లో ప్రధాన పాయగా ఉన్న మావోయిస్టు పార్టీలో ఆర్కే పొలిట్‌ బ్యూరో సభ్యుడు.

తెలంగాణ నుంచి బెంగాల్‌ వరకు 8 రాష్ట్రాల్లో మూడు దశాబ్దాల పాటు మావోయిస్టులకు, ప్రభుత్వాలకు మధ్య నడుమ యుద్ధం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో జీవితాలు కల్లోలిత మయ్యాయి. వేలాదిమంది ప్రజలు, పోలీసులు, విప్లవకారులు ఈ కల్లోలానికి బలయ్యారు. మావోయిస్టులు – ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలు జరిగితే ఈ హింసాకాండను కొంతమేరకు కట్టడి చేయొచ్చని కొందరు తటస్థ మేధావులు భావించారు.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. ఆ చర్చల సమ యంలోనే ఆర్కే మీడియా దృష్టిని ఆకర్షించారు. చర్చల్లో మావోయిస్టు బృందానికి నాయకత్వం వహించారు. ఫలితంగా మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లోకి అందరికంటే ఎక్కువ మీడియా సంపర్కం ఆర్కేకు ఏర్పడింది. ఆయన ఫొటోలు, జీవిత విశే షాలు మీడియా వద్ద సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన వివరాలను మీడియా ప్రజలకు తెలియజేయగలిగింది.

ఆర్కే మరణవార్త మావోయిస్టు పార్టీ స్థితిగతులపై చర్చను రేకెత్తిస్తుంది. ఆ చర్చ కమ్యూనిస్టు మూలసిద్ధాంతాలను కూడా తడుముతుంది. ప్రస్తుత ప్రపంచంలో, మన దేశంలో ఉన్న పరిస్థితులకు ఆ సిద్ధాంతాలు ఏ మేరకు నప్పుతాయనే అంశం కూడా చర్చల్లోకి రాకుండా ఉండదు. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకొని వందేళ్లయింది. వందేళ్లలో సమాజంలో అసమానతలు తగ్గాయా? తగ్గలేదు పెరిగాయని స్వతంత్ర అంతర్జాతీయ సంస్థలు సాక్ష్యాధారాలతో లెక్కలు కట్టి మరీ చెబుతున్నాయి.

ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 90 శాతం మంది ఉమ్మడి సంపద ఎంత ఉంటుందో ఒక్క శాతం కుబేరుల సంపద అంతకంటే ఎక్కువగా ఉందట. మన దేశంలో 119 మంది బిలియనీర్ల సంపద 130 కోట్ల మంది తలరాతలు రాసే భారతదేశ వార్షిక బడ్జెట్‌ కంటే ఎక్కువట. కనీస వేతనంపై పనిచేసే ఒక కార్మికుడు మన దేశంలోని ఒక కార్పొరేట్‌ కంపెనీ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ సంపాదించినంత డబ్బు సంపాదించాలంటే 941 ఏళ్ళ పాటు పనిచేయాలట. కోవిడ్‌ తర్వాత ఈ అసమానతలు మరింత పెరిగాయి. ఆక్స్‌ఫామ్‌ అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంక్షోభంలో కోల్పోయిన సంపదను కుబేరులు ఇప్పటికే భర్తీ చేసుకున్నారు. మెజారిటీ పేదవర్గాల ప్రజలు కోలుకోవడానికి మాత్రం ఇంకో పదేళ్లయినా పడు తుందట.

అసమానతలు మరింత పెరిగే విధానాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలవుతున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమ లను ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి కారుచౌకగా కట్ట బెడు తున్నారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచు కున్న ప్రబుద్ధులను విమానాలు ఎక్కించి విదేశాలకు పంపిస్తు న్నారు. లేదా రాజ్యసభ సభ్యత్వమిచ్చి సత్కరిస్తున్నారు. రైతు లకు అండగా ఉన్న భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారు. కార్మికులతో 12 గంటలపాటు పని చేయించుకు నేందుకు అనువుగా లేబర్‌ చట్టాలను మార్చారు. ఉద్యోగ భద్రత ఊసు మాత్రం అందులో లేదు. రైతులు ససే మిరా అంటున్నా వినకుండా వ్యవసాయ చట్టాలను మోసు కొచ్చారు.

ఈ చట్టాల అంతిమ ధ్యేయం మెజారిటీ రైతులను వ్యవసాయరంగం నుంచి వెళ్లగొట్టడమేనని నిపుణులు అభిప్రా యపడుతున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను జీపుతో తొక్కించి నాలుగు నిండు ప్రాణాలు తీశాడు ఓ కేంద్ర మంత్రి కుమారుడు. ఇప్పటికీ సదరు కేంద్ర మంత్రి పదవిలోనే కొన సాగుతున్నాడు. వారం రోజులపాటు మీనమేషాలు లెక్కించి గానీ అతడి కుమారుడిని అదుపులోకి తీసుకోలేదు. అదే, మైనా రిటీ మతస్థుడైన సూపర్‌స్టార్‌ కొడుకు విషయంలో ఆగమేఘాల మీద చట్టం తన పని తాను చేసుకొనిపోయింది.

జాతీయస్థాయి ప్రత్యామ్నాయంగా రూపొందడానికి వామ పక్ష రాజకీయాలకు అనువైన కాలమిది. కానీ దేశంలో మావోయి స్టులతో సహా కమ్యూనిస్టు పార్టీలన్నీ అవసానదశకు చేరుకుం టున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యూహాల్లోనూ, ఎత్తుగడ ల్లోనూ ఆ పార్టీలు దశాబ్దాలుగా విఫలమవుతూనే వస్తున్నాయి. అదే పరంపర ఇప్పుడూ కొనసాగుతున్నది. కన్హయ్య కుమార్, జిగ్నేశ్‌ మేవానీ లాంటి యువ నాయకులను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్‌కు ఎర్రరంగు పులమాలని రాహుల్‌ గాంధీ ఉత్సాహ పడుతున్నారు. కానీ మధ్యేవాదమే కాంగ్రెస్‌ బలమనే చరిత్ర పాఠాన్ని ఆయన అర్థం చేసుకోలేదు. ఫలితంగా మత శక్తుల ప్రాబల్యం పెరిగినప్పుడు కాషాయరంగు పూసుకోవడం, వాటికి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడు ఎర్రరంగు కోసం వెతకడం వంటి ట్రిక్స్‌ ఉపయోగిస్తున్నారు. జాతీయస్థాయి ప్రత్యామ్నా యంగా నిలబడగలిగే అవకాశాలను ఆయనే స్వయంగా దెబ్బతీసుకుంటున్నారు.

ఇప్పుడు జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరంటే ప్రాంతీయ పార్టీలే. ఇదొక విచిత్ర పరిస్థితి కానీ యథార్థం. ఇప్పుడు కేంద్ర విధానాలపై గొంతు విప్పుతున్నది ప్రాంతీయ పార్టీలే. తాజా విద్యుత్‌ సంక్షోభంలోనూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించిన తర్వా తనే జాతీయ ప్రతిపక్ష నేతలు మేల్కొన్నారు. ఇప్పుడు అధి కారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తున్నాయి. నిఖార్సయిన లౌకిక విధానాలను అవలంబిస్తున్నాయి. దళితులు, గిరిజ నులు, వెనుకబడిన వర్గాలను సాధికార శక్తులుగా మలిచేందుకు తరతమ తేడాలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో అందరి కంటే ముందున్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

పైసా ఖర్చు లేకుండా ఉన్నతస్థాయి వరకూ నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చి ఒక విప్లవానికి ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉన్నతస్థాయి ప్రైవేట్‌ స్కూళ్లలో ఉండే వసతులను అందుబాటులోకి తెస్తున్నది. ఈ కార్య క్రమంలో ఇప్పటికే ఒక దశ పూర్తయింది. ప్రతి క్లాస్‌కూ ఒక టీచర్, ప్రాథమికోన్నత స్థాయి నుంచి ప్రతి సబ్జెక్టుకూ ఒక టీచర్‌ ఉండేవిధంగా ఏర్పాటు చేసింది. మాతృభాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇంగ్లిషును ప్రాథమిక స్థాయి నుంచే బోధనాభాషగా ప్రవేశపెట్టింది. ఫలితంగా రాబోయే తరం పేద విద్యార్థులు నిండైన ఆత్మవిశ్వాసంతో సంపన్నుల పిల్లలతో సమాన స్థాయిలో పోటీపడి నెగ్గగలుగు తారు. విజేతలు కాగలుగుతారు. సాధికార శక్తులుగా తమను తాము నిర్మించుకోగలుగుతారు. అప్పుడు వనరుల అసమాన పంపిణీ వ్యవస్థను వారు సవాల్‌ చేయగలరు. ఒక ప్రత్యా మ్నాయ సంస్కృతిని నిర్మించగలరు.

ప్రభుత్వ  వైద్య రంగంలో సోషలిస్టు క్యూబాను తలపించే విధమైన విస్తరణనూ, ఆధునికీకరణనూ ప్రభుత్వం ప్రారం భించింది. ప్రతి కుటుంబాన్నీ, ప్రతి రోగినీ నెలలో ఒకసారైనా వైద్యుడే స్వయంగా వారివద్దకే వెళ్లి పలకరించే ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించారు. ఇది జనవరి 26 నుంచి అమలులోకి రావాలని ఆయన ఆశిస్తున్నారు. అట్లాగే వ్యవసాయ రంగం కూడా. ఒక విప్లవాన్ని ప్రసవించ బోతున్నది. ఊరూరా నెలకొంటున్న ఆర్‌బీకే సెంటర్లే ఈ ప్రస వానికి మంత్రసానులు. చిన్న రైతును స్వయంపోషకం గావించ గలిగే మహత్తర సామర్థ్యంతో ఆర్‌బీకే సెంటర్లు పనిచేయ నున్నాయి. నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి వ్యవసాయ ఆహార విభాగం ఉన్నతాధికారులు, ఏపీ అధికారులను పిలిపించుకొని మరీ ఆర్‌బీకేల ప్రజంటేషన్‌ తిలకించారు. హర్షధ్వానాలు చేశారు.

సగం జనాభాగా ఉన్న మహిళా శక్తిని ఎంపవర్‌ చేయడాన్ని ఒక అతి ప్రాధాన్యాంశంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్దేశిం చుకున్నది. చంద్రబాబు వాగ్దాన భంగం వల్ల మరణావస్థకు చేరిన ‘మహిళా పొదుపు సంఘా’లను ఈ ప్రభుత్వం పునరు జ్జీవింపజేసింది. నడివయసు మహిళలకు అండగా నిలబడి, వారు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చేయూతనందిస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి నామినేషన్‌ పదవుల్లోనూ, పనుల్లోనూ రిజర్వేషన్‌ కల్పిం చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాలను సాధికారిక శక్తులుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఏ విధంగా ఉండాలి? పేద వర్గాల పట్ల అనుకూలంగా కదా ఉండవలసింది!

ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్టు పార్టీల్లో ముఖ్యంగా ఒక పార్టీ వైఖరి ఆశ్చర్యం గొలుపుతున్నది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన రాజధాని భూసమీకరణలో దాగివున్న కుంభకోణాన్ని అంగీకరించడానికి ఈ పార్టీ నిరాకరిస్తున్నది. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలతో చేసుకున్న ఒడంబడికలో ఇమిడి ఉన్న దుర్మార్గమైన అంతర్జాతీయ స్కామ్‌ను అంగీక రించడానికి తటపటాయిస్తున్నది. పైపెచ్చు తెలుగుదేశం పార్టీతో కలిసి రాజధాని ఉద్యమాన్ని మొదలుపెట్టింది. రైతులూ, డ్వాక్రా మహిళల పట్ల చంద్రబాబు వాగ్దాన భంగాన్ని విస్మరిస్తున్నది.

మహిళలూ, బలహీన వర్గాల పట్ల బాబు వ్యతిరేక వైఖరి పలుమార్లు బహిరంగంగా వ్యక్తమైనప్పటికీ ఆ పార్టీ తప్పు పట్టలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం వరస మారింది. ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజానుకూల కార్యక్రమాలను చూడటానికి నిరాకరిస్తూ కళ్ళు మూసుకుంది. అలా వాల్చిన కనురెప్పల మాటున వారికొక గొప్ప సత్యం సాక్షాత్కరించింది. డ్రగ్స్‌ మాఫియాతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి సంబంధం ఉందట. బట్టకాల్చి మీద వేసినట్టు తెలుగుదేశం పార్టీ చేసిన అడ్డగోలు ఆరోపణ ఇది. దాన్నే మన కామ్రేడ్‌ నారాయణ ‘కోరస్‌’గా అందుకున్నారు. కమ్యూనిస్టులు కూడా నిరాధా రమైన ఎంగిలి ఆరోపణలు చేయవచ్చునా? ఒక్క వర్షానికే కొట్టుకొనిపోయే రోడ్లువేసి కాంట్రాక్టర్ల జేబులు నింపడాన్ని అభివృద్ధిగా గుర్తించి, సకలజన సాధికారతా యజ్ఞాన్ని గుర్తించక పోవడం ఒక జన్యు లోపంగా పరిగణించవలసి ఉంటుంది.

30 లక్షల మంది పేద మహిళలకు ఇళ్లు కట్టించే బృహ త్తరమైన మానవీయ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ప్రారం భించింది. దాన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు కోర్టుకెక్కించి ఆపించాడు. ఇది తప్పని కామ్రేడ్‌ నారాయణకు తోచకపోవడం చిత్రం. తాకట్టు గురించి ఆయన మాట్లాడిన తీరు ఆయన పట్ల చాలా అనుమానాలకు తెరతీసింది. ఆస్తుల తాకట్టు సంగతేమో గానీ సిద్ధాంతాలను తాకట్టుపెట్టడం అత్యంత హేయమైన విష యమని గ్రహిస్తే మంచిది. వైఖరి మార్చుకొని వెంటనే ప్రజల పక్షాన నిలబడకపోతే ఒక మహత్తర చరిత్ర కలిగిన పార్టీని భ్రష్టు పట్టించిన వాళ్లవుతారు. 


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top