Sri Lanka Economic Crisis: తప్పుల... అప్పుల... కుప్ప

Sakshi Editorial On Sri Lanka Economic Crisis

Sri Lanka Economic Crisis: కప్పు టీ వంద రూపాయలు... కోడిగుడ్డు 35 రూపాయలు... కిలో చికెన్‌ వెయ్యి రూపాయలు... పచారీ కొట్ల దగ్గర క్యూలు... రోజూ ఏడెనిమిది గంటల విద్యుత్‌ కోతలు... నిత్యావసరమైన పాలు, పంచదార, బియ్యానికి రేషన్లు... ఆసియాలోనే గరిష్ఠ స్థాయికి ఆర్థిక ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యో ల్బణం పెరిగిన శ్రీలంకలో పరిస్థితికి ఇవి మచ్చుతునకలు. పెట్రోల్, కిరోసిన్‌ల కోసం కొండవీటి చాంతాడంత క్యూలో గంటల తరబడి నిలబడి ఇద్దరు వృద్ధులు మరణించారట. ఆఖరికి ప్రింట్‌ చేసే కాగితం దిగుమతి చేసుకొనేందుకు విదేశీ మారక ద్రవ్యం కరవై, లక్షలాది స్కూలు విద్యార్థుల పరీక్షల రద్దు చేయాల్సి వచ్చింది.

స్వాతంత్య్రం వచ్చిన 1948 నాటి నుంచి ఎన్నడూ లేనంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక దుఃస్థితి ఇది. 2.2 కోట్ల జనాభా ఉన్న ఈ దక్షిణాసియా దేశం ఆదుకొనే దేశాలు, అంతర్జాతీయ సంస్థల కోసం ఆశగా చూస్తోంది. తరిగిపోతున్న దేశ ఆదాయ నిల్వలు, పెరిగిపోతున్న అప్పుల కుప్పల మధ్య తన ప్రధాన ఋణదాత చైనా మొదలు తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) దాకా పలువురి సాయం కోరాల్సి వచ్చింది అందుకే!

శ్రీలంకలో ఇవాళ చివరకు జ్వరానికి వేసుకొనే పారాసెటమాల్‌ సహా అనేక ఔషధాల ధరలు 30 శాతం పైనే పెరిగాయి. ఒకప్పుడు పచారీ సరుకులకు 2 వేలైతే, ఇప్పుడు అంతకు మూడు రెట్లు ఎక్కువ చెల్లిస్తే కానీ ఆ మాత్రం ఇంటికి రావట్లేదు. శ్రీలంకలోని ఇలాంటి సామాన్యుల కష్టాల వెనుక పెద్ద కథే ఉంది. 2019లో గొటబయా రాజపక్స శ్రీలంక అధ్యక్షుడయ్యారు. అప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తుగా ఉంది. తీవ్రవాదుల దాడులు, రాజకీయ సంక్షోభాలు దెబ్బతీశాయి. 2001 నాటి నుంచి ఎన్నడూ లేనంతగా వృద్ధి రేటు పాతాళానికి పడిపోయింది.

ద్వీపదేశానికి విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టే ఆదాయ వనరు పర్యాటకులే. దాదాపు దశాబ్ద కాలం పాటు పెరుగుతూ వచ్చిన వారి సంఖ్య బాగా పడిపోయింది. ఆ పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడు పన్నులకు కోత పెట్టారు. కరెన్సీ ప్రింట్‌ చేయడం మొదలెట్టారు. అధ్యక్షుడు, మంత్రులైన ఆయన సోదరులు, మేనల్లుళ్ళ అనాలోచిత చర్యలతో ద్రవ్యోల్బణం హెచ్చింది. పన్ను రాబడి పడిపోయింది. బడ్జెట్‌ లోటు పెరిగిపోయింది. 

శ్రీలంకను పాలించిన వరుస ప్రభుత్వాలు అధిక వడ్డీ బాండ్లు అప్పు తీసుకున్నాయి. దానికి చైనా, జపాన్‌ తదితర దేశాల నుంచి తీసుకున్న వందల కోట్ల అప్పులు తోడయ్యాయి. అలా తిరిగి చెల్లించాల్సిన విదేశీ ఋణభారం ఇంతలంతలు అయింది. వేలాది కోట్ల ఖర్చుతో కూడిన మౌలిక వసతి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం, ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ కావడంతో శ్రీలంక ఇప్పుడు 600 కోట్ల డాలర్ల వాణిజ్య లోటుతో బండి నెట్టుకొస్తోంది.

ముడి చమురు తీసుకొచ్చి నౌకాశ్రయంలో నౌకలు వేచి ఉన్నా, వాటికి చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డాలర్లు లేని పరిస్థితి. బస్సులు ఆగి, ప్రజా రవాణా సైతం స్తంభించే దశకు వచ్చింది. ఈ సంక్షోభ వేళ సర్కారీ బ్యాంక్‌ సైతం చేతులెత్తేయడంతో, డాలర్‌ మారకం విలువ ఇప్పుడు 280 రూపాయల స్థాయికి చేరింది. క్రెడిట్‌ రేటింగ్‌లో కిందకు జారిపోవడంతో, అప్పులు చేయలేని పరిస్థితి. సహజంగానే ఈ పరిణామాలన్నీ ప్రజల్లో ఆగ్రహావేశాలు రేపాయి. అధ్యక్షుణ్ణి ఇంటి ముఖం పట్టమంటూ అనేక పట్టణాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరగడమే అందుకు నిదర్శనం. కరోనాతో సహా అనేక కష్టాలు మీద పడినప్పటికీ, దక్షిణాసియాలో తమ దేశం ఒక్కటే నెగటివ్‌ వృద్ధిలోకి రావడమేమిటని వారి ప్రశ్న. 

ఆర్థికంగా ప్రభుత్వం చేసిన అనేకానేక తప్పులు, నిర్వహణ లోపాలు, అవినీతి దీనికి ప్రధాన కారణాలని కార్యకర్తల మాట. రాజపక్సకు ఓటు బ్యాంకైన బౌద్ధ సింహళీయుల్లోనే ఆయనను వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. విదేశీ ఋణాల పునర్వ్యవస్థీకరించడంలో ప్రభుత్వం విఫలమైంది. గతంలో చేసినట్టు ఐఎంఎఫ్‌ నుంచి శ్రీలంక అత్యవసర ఋణం తీసుకోవాల్సింది. కానీ, ఆ పనీ చేయలేదు. ఐఎంఎఫ్‌ పెట్టే షరతుల వల్ల పొదుపు చర్యలు చేపట్టాలనీ, ప్రజాకర్షక వాగ్దానాల్ని పక్కన పెట్టాల్సి వస్తుందనీ, రాజకీయంగా నష్టపోతామనీ పాలకులు ఇష్టపడ లేదు. అనేక నెలల తర్జనభర్జన తర్వాత చివరకు ఇప్పుడు ఐఎంఎఫ్‌ సాయం కోరారు. అయితే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

విదేశీ పర్యాటకుల సంఖ్య మళ్ళీ పెరుగుతుందనీ, ఎగుమతులు పెరుగుతాయనీ శ్రీలంక పాలకులు ఆశ పడుతున్నారు. కానీ, అది వట్టి దింపుడు కళ్ళం ఆశేనని నిపుణుల మాట. పైగా, దాని వల్ల ప్రస్తుత సంక్షోభం సమసిపోయే పరిస్థితి లేదు. తప్పుడు విధానాలతో ఆదాయాన్ని వృథా చేసిన పాలకుల వల్ల కొలంబో కష్టాల కడలిలో మునిగింది. ఆ మధ్య బీజింగ్‌కు దగ్గరవుతున్నట్టు కనిపిం చిన కొలంబో సంక్షోభవేళ మన దేశ సాయం కోరింది. మనం సాయం చేయడంతో గత ఏడాదితో పోలిస్తే ఇరుదేశల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి.

అయితే, 2019 నవంబర్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా తమిళ ఎంపీలను ఒక్కసారైనా కలవని రాజపక్స, శ్రీలంక సర్కారు తమిళ అంశంపై రాజకీయ పరిష్కారాన్ని సుదీర్ఘంగా సాగదీస్తూనే ఉంది. ఏమైనా, ఓటేసి ప్రస్తుత శ్రీలంక సర్కారును గద్దెనెక్కించిన వారంతా ఇప్పుడు లెంపలేసుకుంటున్నాం అంటున్నారు. ఖర్చు లకు జీతాలు చాలక, ఉద్యోగమయ్యాక సాయంత్ర వేళల్లో ఆటో నడుపుతున్న ఇంజనీర్ల కథలిప్పుడు బోలెడు. ఇలాగైతే కష్టమని బతుకుతెరువు కోసం సౌదీ సహా వివిధ దేశాలకు ప్రయాణం కడుతున్న వారూ అనేకం. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి రావడమంటే ఇదే! వెరసి, ద్వీపదేశానికి ఇది అగ్నిపరీక్షా సమయం. పాలకుడు రాజపక్సకు భవిష్యత్తు గడ్డుకాలం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top