
జనతంత్రం
భారత్ – పాకిస్తాన్‌ల మధ్య వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది చాలా కాలంగా భారత్ అనుసరిస్తున్న స్థిరమైన విధానం. కశ్మీర్ అంశాన్ని తొలి రోజుల్లో ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకుపోవడం వలన నష్టం జరిగిందనే అభిప్రాయం ఇండియాకు ఏర్పడింది. పాక్, భారత్‌ల మధ్య రెండు కీలకమైన ఒప్పందాలున్నాయి.
1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999లో ప్రకటించిన లాహోర్ డిక్లరేషన్. రెండు దేశాల నడుమ ఏ వివాదం తలెత్తినా ఈ రెండు ఒప్పందాల పరిధిలో, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ చాలా కాలంగా దృఢమైన వైఖరితో ఉండేది. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదు.
ఇందుకు భిన్నంగా రెండు దేశాల వివాదంలో ఇప్పుడు మూడో పక్షం తలదూర్చిందా? కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయనీ, ఇది వెంటనే అమల్లోకి వస్తుందనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా సాయంత్రం 5.30కి ప్రకటించారు. అమెరికా మధ్య వర్తిత్వం వహించి, రాత్రంతా చర్చలు జరిపిన ఫలితంగా ఈ ఒప్పందం సాధ్యమైందని కూడా ఆయన వెల్లడించారు. కామన్ సెన్స్‌నూ, తెలివిడినీ ఉపయోగించినందుకు రెండు దేశాలనూ ఆయన అభినందించారు.
ఆ తర్వాత అరగంటకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయని ఆయన ధ్రువీకరించారు. సాయంత్రం ఐదు గంటలకే అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. అయితే ఆయన ట్రంప్ ట్వీట్ ప్రస్తావన గానీ, అమెరికా మధ్యవర్తిత్వం గురించి గానీ మాట్లాడలేదు. ఈరోజు మధ్యాహ్నం 3:30కు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో), ఇండియా డీజీఎంవోకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని మిస్రీ చెప్పారు.
మూడో పక్షం జోక్యం లేకుండానే ఇరు దేశాలూ ఒప్పందానికి వచ్చాయనే విధంగానే ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ట్వీట్ చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంగానే దీన్ని అభివర్ణించారు. రేపు సోమవారం నాడు రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతు న్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. రెండు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకోవడానికి ముందు నుంచే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రెండు దేశాల ముఖ్య నేతలతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి.
ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా నిర్వహించిన పాత్రేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్తతల సడలింపునకు కాల్పులు విరమణ పాటించాలని స్నేహపూర్వక సలహా మాత్రమే రెండు దేశాలకు ఇచ్చిందా? లేక చర్చల ప్రాతిపదికను తయారు చేసే మధ్యవర్తిత్వ పాత్ర పోషించిందా? ఒకవేళ మధ్యవర్తిగానే చర్చల ప్రాతిపదికను కూడా సిద్ధం చేసి ఉంటే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు వచ్చినట్టే భావించా
యుద్ధం అమానుషమై నది. అనాగరికమైనది. యుద్ధం కారణంగా దేశాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. యుద్ధ ప్రమాదాన్ని నివారించడం వివేకవంతమైన చర్యే! కాల్పుల విరమణ ఆహ్వానించదగ్గదే! అయితే ఈ విరమణ వల్ల దేశం సాధించేది ఏమిటి? పోగొట్టుకునేదేమిటనే విశ్లేషణ కూడా అవసరం.
యుద్ధం భారత్ ప్రారంభించలేదు. ఉగ్రవాదాన్ని ప్రయోగించి పాకిస్తానే కయ్యానికి కాలు దువ్వింది. బదులుగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత్ దాడులు చేసింది. నూరు శాతం కచ్చితత్వంతో చేసిన ఈ దాడులు పదును దేలిన భారత రణ వ్యూహానికీ, అద్భుతమైన సైనిక పాటవానికీ అద్దం పట్టాయి.
భారత దాడులకు పాక్ నివ్వెరపోయింది. అధీన రేఖ వెంబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. జనావాసాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు దిగింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగానే జరిగినట్టు కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా అంగీకరించారు. మిగిలిన సరిహద్దు రాష్ట్రాల కంటే జమ్మూకశ్మీర్ ఈ దారుణాన్ని ఎక్కువగా భరించవలసి వచ్చింది. పసిపిల్లలతో సహా సాధారణ ప్రజలను బలి తీసుకుంటున్న మహమ్మారి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కశ్మీర్ ప్రతిపక్ష నేత మెహబూబా ముఫ్తీ కన్నీళ్ళతో వేడుకున్నారు.
యుద్ధాలను వేగిరపడి ప్రారంభించడం కాకుండా పూర్తి ప్రణాళికను రచించుకొని మొదలుపెట్టాలనీ, వీలైనంత వేగంగా ముగించాలనీ, శత్రువు ప్రతిఘటనా శక్తిని దెబ్బకొట్టి పోరాడకుండానే యుద్ధాలను గెలిచే మార్గాలను అన్వేషించాలనీ సన్‌షూ తన యుద్ధతంత్ర గ్రంథమైన ‘ఆర్ట్ ఆఫ్ వార్’లో చెబుతాడు. ఈ నాలుగు రోజుల భారత దాడుల్లో సన్‌షూ చెప్పిన ‘ఆర్ట్ ఆఫ్ వార్’ కనిపించింది.
ఉగ్రవాద స్థావరాలపై గురి తప్పకుండా, సరిహద్దులు దాటకుండా దాడి చేయడం, పలువురిని మట్టు పెట్టడంతోనే భారత్ సగం యుద్ధాన్ని గెలిచింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేయడం, ఎనిమిది కీలకమైన ఎయిర్ బేస్‌లను దెబ్బతీయటం, బాలిస్టిక్ మిసైల్‌ను గాల్లోనే పేల్చేయడంతో పాకిస్తాన్ దాదాపుగా చేతు లెత్తేసింది.
ఈ దశలోనే పాక్ నేతలు అమెరికా శరణు కోరి ఉంటారనీ, అవమానకరమైన ఓటమి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసి ఉంటారనీ అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా జోక్యం చేసుకున్న విషయం యథార్థం. అది ఏ మేరకు అన్నది తేలవలసి ఉన్నది. సాధారణ ప్రజలపై మారణ హోమం చేయడం తప్ప పాకిస్తాన్ సాధించిందేమీ లేదు. భారత్ సాధించిన ఈ వేగవంతమైన విజయం రేపు జరిగే చర్చల్లో ప్రభావవంతమైన పాత్రను పోషించాలి.
భారత్ కోరుతున్న విధంగా ఉగ్ర హంతకులకు స్థావరం లేకుండా చేస్తామని అంగీకరించాలి. భారత్‌లో నేరాలకు పాల్పడిన ఉగ్రవాదులను అప్పగించడానికి అంగీకరించాలి. భారత కశ్మీర్‌లో వేలు పెట్టబోమని అంగీ కరించే విధంగా పాక్‌పై ఒత్తిడి తేవాలి. సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో పునఃసమీక్షకు అంగీకరించరాదు. అప్పుడే ఇది విజేత షరతుల మేరకు జరిగే ద్వైపాక్షిక చర్చలుగా పరిగణించవలసి ఉంటుంది. లేకుంటే మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమన్న చారిత్రక విధానానికి వీడ్కోలు పలికినట్లవుతుంది.
ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే... కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల తర్వాత సరిహద్దుల వెంబటి పాకిస్తాన్ ఆర్మీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత భూభాగంపై కాల్పులు జరుపుతున్నాయి. ఇది పాకిస్తాన్ రాజకీయ నాయకత్వానికీ, ఆర్మీ నాయకత్వానికీ మధ్య సమన్వయ లోపమా? లేక రేపటి చర్చల్లో బేరమాడేందుకు తమ శక్తిని పెంచు కోవడానికి ఆ దేశం ఆడుతున్న నాటకమా? అదీ త్వరలోనే తేలుతుంది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com