బలం పెరగాలి బ్రదర్‌! | Sakshi
Sakshi News home page

బలం పెరగాలి బ్రదర్‌!

Published Fri, Apr 22 2022 1:19 AM

Ins Vagsheer Scorpene Submarine Launched In Mumbai - Sakshi

దేశ రక్షణ సామర్థ్యాలను పెంచుకొనే ప్రయత్నంలో భారత్‌ మరో అడుగు ముందుకేసింది. కరోనా దెబ్బతో నిర్మాణం ఆలస్యమైన దేశీయ జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌’ బుధవారం ముంబయ్‌లోని మజగావ్‌ డాక్స్‌లో జలప్రవేశం చేసింది. ‘మేకిన్‌ ఇండియా’ మాటలకు మచ్చుతునకగా నిలిచింది. హిందూ మహాసముద్రంలోని విలక్షణ మత్స్యజాతి పేరు పెట్టుకొన్న ఈ మెరైన్‌ అనేక కఠిన పరీక్షలు, ప్రయోగాల తర్వాత వచ్చే ఏడాది చివరలో భారత నౌకాదళంలో భాగం కానుంది. పెరుగుతున్న సరిహద్దు పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సముద్ర తీర భద్రతలో ఎక్కడ ఉన్నామో పునరాలోచించుకొనేందుకు ఇది సరైన సమయం. అందుకోవాల్సిన లక్ష్యాలను పునశ్చరణ చేసుకొనేందుకు చక్కని సందర్భం.

విదేశీ సంస్థల నుంచి సాంకేతిక పరిజ్ఞానం తీసుకొని, దేశీయంగా మెరైన్ల నిర్మాణానికి మన దేశం ఎప్పుడో ప్రణాళిక వేసుకుంది. 1999లో ఆమోదం పొందిన ఆ ప్రణాళికలో భాగంగా ‘పి–75’, ‘పి–75ఐ’ అనే రెండు వేర్వేరు శ్రేణుల మెరైన్లను సిద్ధం చేస్తూ వస్తున్నాం. ‘పి–75’ ప్రాజెక్ట్‌ కింద మన దేశం సమకూర్చుకుంటూ వచ్చిన ఫ్రెంచ్‌ స్కార్పీన్‌ శ్రేణి జలాంతర్గాములలో ఆరవదీ, ఆఖరుదీ – ఈ కొత్త ‘ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌’. 2005 అక్టోబర్‌లో కుదుర్చుకున్న 375 కోట్ల డాలర్ల ఒప్పందంలో భాగంగా నేవల్‌ గ్రూప్‌ నుంచి మనకు సాంకేతిక పరిజ్ఞాన బదలీ జరిగింది. ఆ పరిజ్ఞానంతో మన దగ్గరే మజగావ్‌ డాక్స్‌లో రూపొందిన ‘ఐఎన్‌ఎస్‌ కల్వరి’– 2017 డిసెంబర్‌లో, ‘ఖండేరీ’– 2019 సెప్టెంబర్‌లో, ‘వాగిర్‌’– 2020 నవంబర్‌లో, ‘కరంజ్‌’– గత ఏడాది మార్చిలో, ‘వేలా’– నవంబర్‌లో కమిషనింగ్‌ జరుపుకొన్నాయి. చివరిగా ఇప్పుడు ‘వాగ్‌షీర్‌’వచ్చింది. ఈ డీజిల్‌ యుద్ధ జలాంతర్గామి ప్రత్యర్థి మెరైన్లపై పోరుకూ, నిఘా సమాచార సేకరణకూ, మందుపాతరలు పెట్టడానికీ, ప్రాంతీయ నిఘాకూ తోడ్పడుతుంది. అయితే, ‘వాగ్‌షీర్‌’ చేతికి అంది రావడానికి మరో ఏణ్ణర్ధం పడుతుంది. ఏణ్ణర్ధం క్రితం జలప్రవేశం చేసిన ‘వాగిర్‌’ సైతం ఇంకా ట్రయల్స్‌లోనే ఉంది. వెరసి, మన సామర్థ్యం ఇనుమడించిందని అలసత్వం వహించడానికి వీల్లేదు.  

నిజం చెప్పాలంటే, మన దేశ జలాంతర్గాముల దళం కొంత వెనుకబడిందని గత ఏడాది చివరలో సైతం వార్తలు వచ్చాయి. నౌకాదళంలో, మరీ ముఖ్యంగా జలాంతర్గాముల సామర్థ్యంలో మన కన్నా చైనా ఎంతో ముందుకు దూసుకు పోయింది. జలాంతర్గాముల ఆధునికీకరణలో మనం కనీసం ఓ దశాబ్ద కాలం వెనుకబడ్డామని నిపుణుల కథనం. ఈ పరిస్థితుల్లో మన సముద్రతీర భద్రత రీత్యా మరిన్ని సబ్‌మెరైన్లను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో హిందూ మహాసముద్రంలో చైనా మరిన్ని నౌకలు, సబ్‌మెరైన్లను మోహరించనున్న నేపథ్యంలో అది మరింత అవసరం. అలాగే, మన ప్రత్యర్థి పాకిస్తాన్‌కు 8 సబ్‌మెరైన్లు, 4 యుద్ధ విధ్వంసక నౌకలను చైనా కట్టబెడుతోంది. వాటన్నిటినీ చైనాకు బినామీగా పాక్‌ వాడే ప్రమాదం ఉంది. 

పాతవాటి స్థానంలో కొత్తవి చేర్చుకుంటూ ఏ క్షణంలోనైనా కనీసం 65 నుంచి 70 సబ్‌మెరైన్లు అందుబాటులో ఉండేలా చైనీస్‌ నౌకాదళం చూసుకుంటోందని అమెరికన్‌ నిఘా సంస్థ నివేదిక. పైగా, గడచిన 15 ఏళ్ళలో చైనా 12 అణు జలాంతర్గాముల్ని నిర్మించుకోవడం గమనార్హం. సాంప్రదా యిక సబ్‌మెరైన్ల కన్నా నీటిలో చాలా వేగంగా వెళ్ళగల ఈ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లు ఆకాశంలో ఫైటర్‌ జెట్ల లాంటివి. ఇవి బ్యాటరీలతో నడవవు కాబట్టి, సిబ్బందికి కావాల్సిన సరుకుల కోసమే తప్ప, ఛార్జింగ్‌ చేసుకోవడానికని నీటి నుంచి పైకి రావాల్సిన పని ఉండదు. ఎంతకాలమైనా నీటిలోనే ఉండగలవు. ఎస్‌ఎస్‌ఎన్‌లుగా పేర్కొనే ఈ మెరైన్లున్న 6 దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. మిగతావి – అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా. 1987లోనే రష్యా నుంచి తొలి ఎస్‌ఎస్‌ఎన్‌ను తెచ్చుకున్న మనం దేశ రక్షణ అవసరాల రీత్యా మరిన్ని అణు జలాంతర్గాముల్ని సమకూర్చుకోవాల్సి ఉంది. 

దేశీయంగా రూపొందిస్తున్న 12 మెరైన్లలో సగం ఎస్‌ఎస్‌ఎన్‌లనే చేయాలని ప్రభుత్వం ఆ మధ్య మంచి నిర్ణయమే తీసుకుంది. అంతా అనుకున్న విధంగా జరిగి, ప్రాజెక్ట్‌ వేగంగా సాగినప్పటికీ, 2035 –40కి కానీ మన తొలి దేశవాళీ ఎస్‌ఎస్‌ఎన్‌ బరిలోకి దిగదని అంచనా. ఈలోగా రష్యా నుంచి 2 ఎస్‌ఎస్‌ఎన్‌లను మనం లీజు మీద తీసుకుంటున్నాం. కానీ, అందులో మొదటిది కూడా 2025 నాటికి కానీ మన చేతికి రాదు. ఉక్రెయిన్‌ యుద్ధవేళ అది మరింత ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితులన్నిటి రీత్యా దేశీయంగా రక్షణ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం కీలకం. 

మన నేవీ సైతం ‘కల్వరి’ మొదలు ఈ స్కార్పీన్‌ శ్రేణి మెరైన్లన్నిటినీ రీఫిట్‌ చేసేటప్పుడు ‘ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌’ (ఏఐపి) మాడ్యూల్‌ను పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నదీ అందుకే! దేశీయంగా ఏఐపి మాడ్యూల్‌ను అభివృద్ధి చేసేందుకు మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చేస్తున్న కృషి ఇప్పుడు గణనీయమైన పురోగతి సాధించడం విశేషం. ఈ మార్చి నాటి ప్రాథమిక వ్యయ నివేదిక ప్రకారం దేశ రక్షణ శాఖ గత ఆర్థిక సంవత్సరంలో సైన్యానికి కేటా యించిన బడ్జెట్‌లో 99.5 శాతాన్ని వినియోగించడం గమనార్హం. కానీ, ఇప్పటికీ ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 11 శాతం మనదే. అతి పెద్ద ఆయుధ దిగుమతి దేశమైన మనం ఆ కథను తిరగ రాయాల్సి ఉంది. ‘మేకిన్‌ ఇండియా’ అంటూ ఇటీవల రూ. 47 వేల కోట్ల విలువైన 9 విదేశీ ఆయుధ ఒప్పందాలను పక్కనపెట్టిన మనం త్వరితగతిన ఆ కలను సాకారం చేసుకోవడం అవసరం.

Advertisement
 
Advertisement