కప్పల తక్కెడ!

Editorial On Political Situation In Meghalaya State - Sakshi

భిన్న ధ్రువాలు కలవవు అని సాధారణ సూత్రం. కానీ, సిద్ధాంతాలకు తిలోదకాలిస్తే, రాజకీయాలలో ఎవరైనా ఎవరితోనైనా కలిసిపోవచ్చని మరోసారి రుజువైంది. అధికారమే పరమావధిగా అన్ని తేడాలూ పక్కన పెట్టేస్తే, అందరూ కలసి ఏక ధ్రువ రాజకీయం చేయదలిస్తే ఏమవుతుంది? ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో అదే అయ్యింది! మేఘాలయలోని కాంగ్రెస్‌లో మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేలూ మంగళవారం నాడు బీజేపీ సమర్థిస్తున్న ‘మేఘాలయ డెమోక్రాటిక్‌ అలయన్స్‌’ (ఎండీఏ)లో చేరారు. దీంతో, ఒకప్పుడు 17 మంది ఎమ్మెల్యేలతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఇప్పుడక్కడ ఖాళీ అయిపోయింది. ఆ రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఒక్కటే అసెంబ్లీలో ప్రతిపక్షం జాగాలో మిగిలింది. స్థానిక కారణాలు ఏమైనా, బద్ధ శత్రువులనుకున్న కాంగ్రెస్, బీజేపీలు కలసిన విచిత్రమైన పరిస్థితి. 

నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) సారథ్యంలోని అధికార కూటమిలో చేరామే తప్ప, కాంగ్రెస్‌లోనే ఉన్నామని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకురాలైన అంపరీన్‌ లింగ్డో అంటున్నారు. సైద్ధాంతిక బద్ధవిరోధి బీజేపీ సమర్థిస్తున్న ఆ కూటమి ప్రభుత్వంలో చేరడానికి సరైన కారణం కాంగ్రెస్‌ నేతల వద్ద కనిపించదు. పైకి మాత్రం ప్రజాప్రయోజనాల రీత్యా, రాష్ట్రాన్ని కలసికట్టుగా ముందుకు తీసుకుపోవడానికి వీలుగా ప్రభుత్వానికి చేదోడుగా నిలిచేందుకే ఈ పని చేశామంటున్నారు. ఆ మాటే మంగళవారం నాటి ప్రభుత్వ సమర్థన లేఖలో రాసిచ్చారు. కానీ, అధికారమే పరమావధి అయిన రోజుల్లో ప్రతిపక్ష స్థానంలోని పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి, విరోధి పంచన ఉన్న అధికార కూటమిలో ఎందుకు కలిసి ఉంటారో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. 

మేఘాలయ అసెంబ్లీలో మొత్తం 60 మంది సభ్యులుంటారు. గడచిన 2018 ఎన్నికలలో కాంగ్రెస్‌ 21 స్థానాల్లో గెలిచింది. తర్వాత ఆ సంఖ్య 17కు తగ్గింది. అసెంబ్లీలో ఆ పార్టీయే ప్రతిపక్షం. కానీ, తర్వాత ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా సహా 12 మంది ఎమ్మెల్యేలు గత నవంబర్‌లో టీఎంసీలోకి ఫిరాయించారు. అలా అప్పటి నుంచి కాంగ్రెస్‌లో అయిదుగురే మిగిలారు. తాజాగా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకురాలైన అంపరీన్‌ లింగ్డో సహా అయిదుగురూ తమ ప్రతిపక్ష పాత్రకు గుడ్‌బై చెప్పేశారు. అధికార కూటమికి జై కొట్టేశారు. గత నవంబర్‌ నాటి ఫిరాయింపులే ఓ పెద్ద ఎదురుదెబ్బ అనుకుంటే, ఇప్పుడు మిగిలిన కొద్దిమందీ అధికార కూటమిలో చేరడంతో ఈ ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుట్టి మునిగింది.  

అయితే, ఈ పరిణామం మరీ అనూహ్యమేమీ కాదు. సాక్షాత్తూ కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకురాలే పార్టీని వీడి, ముఖ్యమంత్రి కాన్‌రాడ్‌ సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీలో చేరతారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. కాంగ్రెస్‌ను వీడి, ఎన్‌పీపీలో చేరిన భర్త బాటలోనే ఆమె కూడా వెళతారన్న మాట బయటకొచ్చింది. ఆమె మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన తాను అర్ధరాత్రి దొంగలాగా పారిపోననీ, ఈ పర్యాయం ఇక్కడే కొనసాగుతాననీ, తర్వాత సంగతి తర్వాతనీ చెబుతూ వచ్చారు. తీరా వారం తిరగక ముందే సహచరులతో సహా వెళ్ళి, అధికార కూటమిలో కలిసిపోయారు. సాంకేతికంగా మాత్రం తాము కాంగ్రెస్‌ పార్టీనే అంటున్నారు. మేఘాలయాలో పార్టీలో మిగిలిన పెద్ద పేర్లయిన ఆమె, ఆమె సహచర ఎమ్మెల్యే సాక్మీ కూడా ప్లేటు తిప్పడంతో కాంగ్రెస్‌ కుండ ఖాళీ అయింది. 
‘ఈ కాలమాన పరిస్థితుల్లో మమ్మల్ని మేమే కాపాడుకోవాలి. మేము అయిదుగురం ఒకరి నొకరం రక్షించుకుంటున్నాం’ అన్నది అంపరీన్‌ మాట. అధికారానికి దూరంగా ఉన్నవేళ అనేక రాజకీయ, ఆర్థిక అనివార్యతలు ఆమెనూ, ఆమె సహచరులనూ తాజా నిర్ణయం వైపు నెట్టాయని పరిశీలకుల ఉవాచ. చూపరులకే కాదు, రెండువైపులా పార్టీ పెద్దలకూ ఈ తాజా పరిణామం కొంత ఇబ్బందికరమే. ‘సింహం, లేడీపిల్ల ఒకేచోట, ఒకేసారి నీళ్ళెలా తాగుతాయి’ అని మేఘాలయ బీజేపీ ఛీఫ్‌ మాట. ‘ఇది దిగ్భ్రాంతికరం’ అన్నది రాష్ట్ర కాంగ్రెస్‌ ఛీఫ్‌ వ్యాఖ్య. నిజానికి, చరిత్ర చూస్తే ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కలిసి అడుగులేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చూసినదే. కాకపోతే, ఈసారి కొంత ఎక్కువ రచ్చ జరుగుతోంది. 

సిద్ధాంతాలకు తిలోదకాలివ్వడంలో అన్ని పార్టీలదీ ఒకే తంతు. అందరికీ అధికారమే పరమా వధి. అవకాశవాద రాజకీయాల వేళ పొరుగునే ఉన్న మిజోరమ్‌లో సైతం చక్మా స్వయంప్రతిపత్తి జిల్లా కౌన్సిల్‌లో అధికారం కోసం కాంగ్రెస్‌తో బీజేపీ చేతులు కలిపింది. మేఘాలయలో నైతికత గురించి మాట్లాడుతూ వచ్చిన తృణమూల్‌ కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని మరీ, రాష్ట్రంలో కాస్తంత పట్టు చిక్కించుకుంది. వచ్చే ఫిబ్రవరిలో నాగాలాండ్, త్రిపురలతో పాటు సరిహద్దు రాష్ట్రం మేఘాలయలోనూ ఎన్నికలు. ఒకప్పుడు తాము పాలించిన రాష్ట్రాల్లో అధికారానికి దూరమయ్యాక కాంగ్రెస్‌ చిక్కుల్లో పడింది. ఫిరాయింపులు పెరుగుతున్నాయి. తాజాగా ఎన్నికలు జరుగుతున్న గోవా, మణిపూర్‌ లాంటి చోట్ల పార్టీ మారబోమంటూ అభ్యర్థులతో ముందే ఒట్టు వేయించుకొంటున్న విచిత్ర పరిస్థితి. ఎవరు ఎటువైపు అయినా గెంతేసే ఈ కప్పల తక్కెడ సంస్కృతి ప్రజాస్వామ్యానికి శోభస్కరం కాదు. ప్రతిపక్షాలు అధికారం కోసం బాధ్యత విస్మరించినా, ప్రజా శ్రేయస్సంటూ ప్రతిపక్షమే లేకుండా పాలన చేద్దామని అధికారపక్షం అనుకున్నా చరిత్ర క్షమించదు!

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top