నిడదవోలు రూరల్: వినాయక చవితి వస్తోందంటే చాలు భక్తుల్లో కోలాహలం మొదలవుతుంది. గణనాథుడి విగ్రహాలతో పట్టణాలు, గ్రామాలు కళకళలాడతాయి. కానీ ఆ విగ్రహాలకు జీవకళ ఇచ్చే కార్మికుల జీవితాలు వెలవెలబోతున్నాయి. నెలల తరబడి శ్రమించి, అప్పులు చేసి రూ.లక్షలు పెట్టుబడి పెట్టి విగ్రహాలు తయారు చేస్తున్నా.. విక్రయాలపై నమ్మకం లేకపోవడంతో ఏటా నష్ట భయంతోనే పండగ కోసం ఎదురుచూస్తున్నారు. ఉత్పత్తి వ్యయానికి తగిన గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. వచ్చే నెల 14 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండడంతో ఇప్పటికే విగ్రహా ఏర్పాటు కమిటీ సభ్యులకు ఇష్టమైన రీతిలో గణనాథుల విగ్రహాలను కళాకారులు సిద్ధం చేస్తున్నారు.
అప్పులు తెచ్చి తయారీ
చేతుల్లో అద్భుతమైన కళ.. కళ్లముందు వినాయకుడి రూపం.. కానీ కళకు తగ్గ పైకం మాత్రం చేతిలో కనిపించడం లేదు. నిడదవోలు మండలంలోని సమిశ్రగూడెం, డి.ముప్పవరం గ్రామాల్లో వినాయక ఉత్సవాల కోసం నెలల ముందు నుంచే విగ్రహాలు తయారు చేస్తుంటారు. ముడి సరకులు, పెయింటింగ్, కూలీలు, రవాణా తదితర ఖర్చులు పెరుగుతున్నా.. విగ్రహాల ధరలు మాత్రం ఆ మేరకు పెరగడం లేదు. విగ్రహాల తయారీకి ఏటా సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతోందని గత మూడేళ్లుగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్టపోతున్నామని కళాకారులు చెబుతున్నారు. ఈ కళను నమ్ముకున్న వారు సొంత నిధులతో అప్పులు తెచ్చి విగ్రహాలను రూపొందిస్తున్నారు. తీరా ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగకపోతే చేసిన అప్పులు తీర్చడం పెనుభారంగా మారుతోంది. అంతేగాక విగ్రహాల తయారీ పూర్తయ్యాక వాటిని భద్రపరచడం మరో పెద్ద సవాలుగా మారింది. వర్షం కురిస్తే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలు తడిసి రూపురేఖలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే చవితి పూర్తయ్యే వరకూ వాతావరణం ఎలా ఉంటుందోనన్న ఆందోళన కళాకారుల్లో వ్యక్తమవుతోంది.
మట్టి విగ్రహాలతో జీవనోపాధికి దెబ్బ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాల వినియోగంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థలు సైతం ఉచితంగాా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయి. పర్యావరణ స్పృహ ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకున్న సంప్రదాయ కళాకారులకు ప్రత్యామ్నాయ మార్కెటింగ్, పునరావాసం చూపకపోవడంతో వారి జీవనోపాధి తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రభుత్వం స్పందించి రాయితీపై ముడిసరుకులు, తక్కువ వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సదుపాయం కల్పించి తమను ఆదుకోవాలని కళాకారులు కోరుతున్నారు.
విగ్రహాలెన్ని చేసినా లాభాలు కరవు
రూ.లక్షల్లో పెట్టుబడి..
అదే స్థాయిలో నష్టాలు
గిట్టుబాటు ధరలేక వ్యాపారుల గగ్గోలు
నిడదవోలు పరిసరాల్లో విక్రయానికి సిద్ధంగా వినాయక విగ్రహాలు
కరోనా కాలం నుంచీ కష్టాలే..
16 ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఏటా సుమారు రూ.10 లక్షల పెట్టుబడి వ్యయం అవుతోంది. కరోనా కాలం నుంచి ఏటా రూ.2 లక్షలు పైగా నష్టం వస్తోంది. డిమాండ్‌కు తగ్గ ధర లేకపోవడమే ప్రధాన సమస్య. పర్యావరణ పరిరక్షణతో పాటు మా లాంటి కళాకారులు బతికేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి.
– సంగినీడి సత్యనారాయణ, విగ్రహాల తయారీదారుడు, డి.ముప్పవరం


