● పోలీసుల అదుపులో నిందితులు?
● కేసు నమోదులో నిర్లక్ష్యంపై వీఆర్‌కు ఎస్సై
● జీజీహెచ్ ఔట్‌పోస్టు సిబ్బంది తొలగింపు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బొమ్మూరుకు చెందిన వివాహితపై గాడాలకు చెందిన యువకుల హత్యాయత్నం కేసుకు సంబంధించి ఎట్టకేలకు కోరుకొండ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ఐదు రోజుల తరువాత కానీ పోలీసులకు విషయం తెలియకపోవడంపై ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. ‘పుట్టిన రోజుకని పిలిచి హత్యకు కుట్ర’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఎస్పీ డి.నరసింహ కిశోర్ సంబంధింత అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా ఆదివారం రాత్రి నిందితులు మట్టాడి అయ్యప్ప, మట్టాడి దేవీ వరప్రసాద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని పోలీసులు తెలిపారు.
ఘటనపై ఎస్పీ ఆగ్రహం
శాంతిభద్రతలతో ముడిపడి ఉన్న ఈ ఘటన ఆలస్యంగా తెలియడం పోలీసుల వైఫల్యంగా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రియాంక ఘటన సైతం ఇలాగే బయటపడకపోవడం, మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంటుండడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తీసుకున్న ఎస్పీ కోరుకొండ ఎస్సై రమేష్‌ను వీఆర్‌లోకి పంపినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వాసుపత్రి పోలీసు ఔట్‌పోస్ట్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని కూడా అక్కడనుంచి తొలగించారు.
పరువు కాపాడుకునేందుకే
వివాహితపై దాడి చేసి హత్యయత్నానికి ప్రయత్నించిన యువకుల కోసం రెండు పోలీసు బృందాలు ఆదివారం గాలించి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ప్రకటన విడుదల చేస్తూ కోరుకొండ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న చిత్రాన్ని ప్రదర్శించారు. పోలీసులు వారిని విచారించగా హత్య చేసేందుకు ప్రయత్నించిన మాట వాస్తమేనని ఒప్పుకున్నారు. చావు బతుకుల నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధనలక్ష్మి భర్త నుంచి విడిపోవడంతో నిందుతుల్లో ఒకరైన మట్టాడి దేవీవరప్రసాద్ నాలుగేళ్లుగా ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఇంటికి కూడా వెళ్లేవాడు. అతడికి పెళ్లి సంబంధాలు చూస్తున్న అతని అన్నయ్య మట్టాడి అయ్యప్పకు ఈ విషయం నచ్చలేదు. కుటుంబం పరువు పోతుందనే ఉద్దేశంతో తమ్ముడితో కలసి ఆమె హత్యకు పథకరచన చేశారు. ఈ మేరకు ఈనెల 25వ తేదీ రాత్రి ఆమెను పుట్టినరోజు సాకుతో పిలిచి గాడాలలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి హత్యయత్నానికి పాల్పడినట్టు తెలిపారు.


