● మార్కెట్‌లో మంచి ధర
● పది టన్నుల లారీ రూ.1.80 లక్షలు
● ఇతర రాష్ట్రాలకు రోజూ
60 లారీల్లో ఎగుమతులు
పెరవలి: అరటి ధరలో గెలిచింది.. రైతుల మోముకు ‘ధర’హాసం తెచ్చింది.. ఏడాదిగా కష్టాలు పడుతున్న కర్షకులకు ఊరటనిచ్చింది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో అరటి దిగుబడి లేకపోవడంతో కలసి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తుపాను దెబ్బకు అరటి తోటలు తలలు వాల్చాయి. వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో రైతులు విలవిల్లాడారు. ప్రస్తుతం మార్కెట్‌లో కర్పూర అరటికి మంచి డిమాండ్ ఉండడంతో గత నష్టాలను పూడ్చుకొనేందుకు తాపత్రయ పడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు 10 టన్నుల లారీ రూ.60 వేల నుంచి రూ.90 వేల ధర పలకగా, ప్రస్తుతం మార్కెట్‌లో రూ.1.80 లక్షలకు చేయడంతో కళ వచ్చింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నుంచి నిత్యం 60 లారీల వరకూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు అవుతున్నాయి. దీంతో రైతులు పక్వానికి వచ్చిన అరటి గెలలను మార్కెట్‌కు తరలించి, విక్రయిస్తున్నారు.
7500 హెక్టార్లలో సాగు
తూర్పుగోదావరి జిల్లాలో అన్ని రకాల అరటి సాగు 7,500 హెక్టార్లలో సాగవుతోంది. ముఖ్యంగా పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, నల్లజర్ల, చాగల్లు, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి, సీతానగరం, రాజానగరం, అనపర్తి మండలాల్లో ఈ సాగు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో 4 వేల హెక్టార్లలో తోటలు దిగుబడికి వచ్చాయని, కానీ ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెరగటంతో ఏమాత్రం పక్వానికి వచ్చినా వెంటనే వాటిని కోతలు కోస్తున్నారు. అరటి మార్కెట్‌లో గత ఏడాది జూన్ నుంచి ధరలు పతనం అవుతూ ఉన్నాయి. పది టన్నుల అరటి లారీ రూ.60 వేలకు పడిపోయింది. ప్రస్తుతం కర్పూర అరటి మార్కెట్‌లో రూ.1.80 లక్షలు పలకటంతో రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ అరటి తోటల వైపు కన్నెత్తి చూడని వ్యాపారులు, నేడు నేరుగా చేల వద్దకు వెళ్లి అడ్వాన్సులు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. అలాగే చెక్కరకేళీ గెల ఒక్కటి రూ.300, ఎర్ర చెక్కరకేళీ గెల ఒకటి రూ.500 పలుకుతుంది. మార్కెట్‌లో సైకిల్ లోడ్ (6 గెలలు) కర్పూర అయితే నాణ్యతను బట్టి రూ.1,500 నుంచి రూ.1,800, చక్కరకేళీ రూ.2 వేల నుంచి రూ.2400, ఎర్ర చక్కరకేళీ రూ.2,500 నుంచి రూ.3 వేల వరకూ పలుకుతున్నాయి.
పెరిగిన ఎగుమతులు
జిల్లాలో అరటి ఎగుమతులు పది రోజులుగా పెరిగాయి. గతంలో ఇతర రాష్ట్రాలైన ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ నుంచి రోజూ 80 నుంచి 100 లారీల సరకు మనకు రావడంతో ఇక్కడి అరటికి తీవ్రంగా దెబ్బతగిలింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో సరకు లేకపోవడంతో జిల్లా నుంచి రోజూ 60 లారీల సరకు ఎగుమతులు అవుతున్నాయి. దీంతో మన సరకుకు డిమాండ్ రావటంతో అరటి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఉపాధి పొందుతూ..
జిల్లాలో అరటి సాగును 8 వేల మంది రైతులు చేస్తున్నారు. తోటలకు వెదురు వేసే కూలీలు, గెలలకు అరటి ఆకులు చుట్టే, గెలలను కోసే కూలీలు, అరటి వ్యాపారులు సుమారు 30 వేల మంది వరకూ ఉంటారు. గతంలో మార్కెట్‌లో ధరలు తగ్గటంతో వీరందరికి ఉపాధి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ధరలు పెరగటంతో రోజుకి కూలి రూ. 500 నుంచి రూ.1500 వస్తుందని చెబుతున్నారు.
ప్రభుత్వ సాయం అందలేదు
గత ఏడాదిగా అరటి ధరలు పతనం కావడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మార్కెట్ పెరగటంతో ఆ నష్టాలు పూడ్చుకొనే పరిస్థితి వచ్చింది. గత తుపాను సమయంలో ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదు.
– యాతం మల్లికార్జునరావు,
రైతు, అన్నవరప్పాడు
అడ్వాన్సు ఇచ్చి మరీ..
నిన్న మొన్నటి వరకు తోటలు కొనేవారే లేరు. నేడు వ్యాపారులు తోటల వద్దకు వచ్చి అడ్వాన్సు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. నిన్నటి వరకు కర్పూర గెల రూ.50 కొననివారు నేడు రూ.200కు కొంటున్నారు.
– దారుపురెడ్డి కృష్ణ, రైతు, అన్నవరప్పాడు
నష్టాలు పూడ్చుకునేందుకు..
ఈ ఏడాది ప్రారంభంలో ధరలు బాగానే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ధరలు పెరిగిన ట్లు పెరిగి ఫిబ్రవరి నుంచి తగ్గిపో యాయి. ప్రస్తుతం ధర పెరగడంతో అరటి సాగు చేస్తున్న రైతులు గత నష్టాలను పూడ్చుకోవటానికి వీలు కలిగింది. – పెనుమత్స
వెంకట గోపాలకృష్ణంరాజు, రైతు, ఖండవల్లి


