● ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం
● పాల్గొన్న సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు
అన్నవరం: రత్నగిరిపై బుధవారం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు, సభ్యులు, ప్రత్యేకాహ్వానితులుగా నియమితులైన మట్టే సత్యప్రసాద్, ఎంఎస్ రెడ్డి, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. తీర్మానాలు ఇవే..
● దేవస్థానంలో నిర్మిస్తున్న సీతారామ సత్రంలో గతంలో నిర్ణయించిన 105 గదులకు బదులు 140 గదులు వచ్చేలా ప్లాన్‌లో మార్పులు చేస్తూ సవరించిన అంచనాలను మండలి ఆమోదించింది. ఈ ప్రకారం వ్యయం రూ.11.40 కోట్ల నుంచి రూ.12.40 కోట్లకు పెరిగింది.
● సత్యదేవుని జూనియర్ కళాశాలలో చదువుతున్న 200 మంది, డిగ్రీ కళాశాలలో చదువుతున్న 300 దూర ప్రాంత విద్యార్థులకు దేవస్థానం అన్నదాన పథకం నుంచి మధ్యాహ్న భోజనం అందించేందుకు తీర్మానించారు.
● రత్నగిరి పవర్ హౌస్ నుంచి స్వామి వారి ప్రధానాలయం, పరిసర ప్రదేశాలకు 300 స్కేర్ ఎంఎం కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్, ప్యానల్ బోర్డు ఏర్పాటుకు తక్కువ టెండర్ రూ.20.76 లక్షలను ఆమోదించారు.
● సీతారామ సత్రంలోని గదుల్లో వేయడానికి వంద కొత్త పరుపులు, తలగడలు, ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాలలో సుప్రీం లేదా నీల్ కమల్ మోడల్ కుర్చీల సరఫరాకు రూ.19.80 లక్షలతో రూపొందించిన అంచనాలను ఆమోదించారు. సర్క్యులర్ మండపం, లాకర్సు రూమ్‌లో ఫ్లోరింగ్, ఇతర అభివృద్ధి పనులకు రూ.15 లక్షల వ్యయంతో అంచనాలను ఆమోదించారు.
● సత్యదేవుని ఆలయానికి వెళ్లే ఉచిత దర్శనం మెష్ క్యూ లైన్ల స్థానంలో స్టెయిన్‌లెస్ స్టీల్ క్యూ లైన్లు ఏర్పాటుకు రూ.40 లక్షల వ్యయంతో రూపొందించిన అంచనాలను ఆమోదించారు.
● దేవస్థానం సీఆర్వో ఆఫీసు సమీపంలో గల టాయిలెట్ బ్లాక్‌లో రూ.20.50 లక్షలతో కొత్త టైల్స్, సివిల్ మరమ్మతులు, రంగులు వేయడానికి తీర్మానించారు. భక్తులకు లిఫ్ట్ వద్ద, అన్నప్రసాద భవనం క్యూ లైన్లు వద్ద రూ.6.5 లక్షలు వ్యయంతో పాలి కార్బొనేటెడ్ షెడ్లు వేయనున్నారు.
● పశ్చిమ రాజగోపురం వద్ద గల ఒకటి, రెండు నంబర్ల పూజా ద్రవ్యాలు, ఫ్యాన్సీ షాపులకు గత వారం జరిగిన వేలం పాటలను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ షాపులలో మొదటి షాపునకు నెలకు రూ.16.73 లక్షలు, రెండో షాపునకు రూ.18.36 లక్షలకు వేలం పాట ఖరారైంది. అయితే వీటిలో కొబ్బరికాయ, అరటిపండ్లను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ట్రస్ట్‌బోర్డులో చర్చ జరిగింది. వ్రతం సెట్‌లో ఆరు కొబ్బరికాయలు, ఆరు అరటిపండ్లను రూ.180 కు విక్రయించాలని పదేళ్ల క్రితం దేవస్థానం నిర్ణయించింది. అయితే ఇప్పుడు అదే ధరకు విక్రయించడం సాధ్యపడదని కనీసం రూ.250కి విక్రయించేలా రేట్లు పెంచాలని పాటదారులు కోరారు. దీంతో పాటదారులు కోరినట్టు రేటు పెంచి మరలా వేలం నిర్ణయించాలని ట్రస్ట్‌బోర్డులో ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు.
● సత్యదేవుని గోధుమనూక ప్రసాదం తయారీలో వాడే ఆవు నెయ్యిని సరఫరా చేసే కాంట్రాక్టును విజయ డెయిరీ దక్కించుకుంది. జూలై ఒకటో తేదీ నుంచి దేవస్థానానికి ఆవునెయ్యి సరఫరా చేయడానికి టెండర్లు పిలవగా కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ కో ఆపరేటివ్ సొసైటీ (విజయ డెయిరీ) కిలో రూ.647.89కి కోట్ చేసింది. ప్రస్తుతం నెయ్యి సరఫరా చేస్తున్న సంగం డెయిరీ కేజీ రూ.674కి వేసింది. దీంతో లోయెస్ట్ టెండర్‌దారుగా విజయ డెయిరీ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ మేరకు విజయ డైరీ కి నెయ్యి సరఫరా ఖరారు చేస్తూ ట్రస్ట్‌బోర్డు సమావేశంలో తీర్మానించారు.


