చిట్టితల్లీ ఎక్కడున్నావ్‌ ! | - | Sakshi
Sakshi News home page

చిట్టితల్లీ ఎక్కడున్నావ్‌ !

Jun 25 2026 9:33 AM | Updated on Jun 25 2026 9:33 AM

19 రోజులైనా లభించని జ్ఞానేశ్వరి ఆచూకీ

తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు

నిరీక్షించి నీరసించిన తల్లి భవాని

తుని రూరల్‌: ఆయిల్‌పామ్‌ తోటలో ఆడుకుంటూ అల్లరి చేసే రెండేళ్ల సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 19 రోజులైనా ఆచూకీ లభించలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సబ్‌డివిజన్‌ పోలీసులు, హనుమాన్‌ టీం, అటవీ బృందాలు ఆ బాలిక ఆచూకీ కోసం చేసిన గాలింపు చర్యలు జరుపు తున్నా ఫలితం ఉండడం లేదు. కాగా.. చిన్నారి ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తుని మండలం దొండవాక పంచాయతీ శివారు సీహెచ్‌ అగ్రహారం వద్ద 40 ఎకరాల ఆయిల్‌పామ్‌ తోట కాపలాదా రులు సుంకర గణేష్‌, భవాని దంపతుల ప్రథమ కుమార్తె జ్ఞానేశ్వరి ఈ నెల ఆరో తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తోటతో పాటు సమీపంలోని 500 ఎకరాలకు పైగా విస్తరించిన అటవీ ప్రాంతాన్ని, సీహెచ్‌ అగ్రహారం, అటికెవానిపాలెం గ్రామాల పరిధిలోని పంట భూములు, చెరువులు, నీటి కుంటలను ఆయా బృందాలు అణువణువునా గాలించాయి. అడవి జంతువుల కదలికలను గుర్తించేందుకు డ్రోన్లు, థర్మల్‌ స్కానర్లు, నైట్‌ విజన్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాయి. సీహెచ్‌ అగ్రహారం, దొండవాక, రాపాక, కేఓ మల్లవరం, డి.పోలవరం గండితో పాటు తుని పట్టణంలో ప్రధాన ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌లను సేకరించి క్షుణ్ణంగా పరిశీలించాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క ఆధారం లభించలేదు. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌, గాలింపు చర్యలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు.

నిరీక్షించి నీరసించిన తల్లి

తప్పిపోయిన కుమార్తె కోసం ఎదురు చూస్తూ తల్లి భవాని నీరసించిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం మోటారు సైకిల్‌పై ముందు భర్త, వెనుక ఆడపడుచు ఆసరాతో మధ్యలో కూర్చుని తుని ఆస్పత్రికి వెళ్లింది. కుమార్తె కనిపించకపోవడంతో బెంగపెట్టుకున్న భవానీకి నిద్రాహారాలు లేవని,

దీంతో నీరసించి పోయిందని భర్త గణేష్‌ తెలిపాడు.

కొనసాగుతున్న దర్యాప్తు

కాల్‌ డేటా, సీసీ ఫుటేజ్‌, ఇతరేతర సాంకేతిక కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాం. అనుమానితులను విచారిస్తున్నాం. అనుమానిత ఫోన్‌ నంబర్లు, అటుగా రాకపోకలు సాగించిన వాహనాల కదలికలపై ఆరా తీస్తున్నాం. పెంపుడు కుక్క పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉంది. గాలింపు చర్యలు, కూంబింగ్‌ కొనసాగుతున్నాయి. – బి.కృష్ణమాచారి, ఎస్సై, తుని రూరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement