కొత్తపేట: కుమార్తె పెళ్లి శుభలేఖలు పంచి వస్తున్న దంపతులను ఇసుక లారీ ఢీకొంది. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తామరాడ గ్రామానికి చెందిన దాసిరెడ్డి నాగ వెంకట రామకృష్ణ, ధనలక్ష్మి కుమార్తెకు జూలై ఒకటిన వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ దంపతులు శుభలేఖలు పంచేందుకు మోటార్ సైకిల్‌పై ముమ్మిడివరంలో బంధువుల ఇళ్లకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొత్తపేట బోడిపాలెం సమీపానికి వచ్చేపరికి ఎదురుగా ఇసుక లోడుతో వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స జరిపి, ఉన్నత వైద్యం కోసం తణుకు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆటో తిరగబడి డ్రైవర్ మృతి
ఆత్రేయపురం: రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో ఆటో తిరగబడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొండేపూడి లక్ష్మీ గణేష్ (20) మంగళవారం ఆత్రేయపురంలో బంధువుల ఇంటికి పెళ్లి పార్టీకి ఆటోలో వచ్చాడు. పార్టీ అనంతరం రాత్రి స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా, ఆత్రేయపురం మెయిన్ రోడ్డులో కుక్క అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో డ్రైనేజీలోకి ఆటో తిరగబడింది. ఈ ఘటనలో లక్ష్మీగణేష్ తలకు బలమైన గాయం కావడంతో కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు వెంకట నాగ ముని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్ తెలిపారు.
కుటుంబ కలహాలతో భార్యపై చాకుతో దాడి
రాజోలు: మండల కేంద్రమైన రాజోలులో బుధవారం కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త చాకుతో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని కుక్కలవారి పేటలో ఓ అద్దె ఇంట్లో తాడి లక్ష్మీదుర్గ, ప్రకాశరావు దంపతులు నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలాగే మంగళవారం రాత్రి మరోసారి వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. తీవ్ర ఆవేశానికి గురైన భర్త ప్రకాశరావు చాకుతో భార్యపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు రాజోలు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఘటన అనంతరం ప్రకాశరావు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం.


