● రూ.2.50 లక్షలతో
పైకప్పు ఏర్పాటుకు చర్యలు
● ధర్మకర్తల మండలి
సమావేశంలో తీర్మానం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలోని శ్రీగోకులం పైకప్పును రూ.2.50 లక్షలతో పటిష్టంగా ఏర్పాటు చేయాలని దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. గోకులం పైకప్పుకు రంధ్రాలు ఏర్పడి, వర్షానికి గోవులు తడిసిపోతుండడంతో ఈ నెల 14న సాక్షి దినపత్రికలో శ్రీగోకులం.. అధ్వానం అనే శీర్షికన కథనం వచ్చింది. రెల్లుగడ్డితో నేసిన పైకప్పు నుంచి వర్షం నీరు కారడంతో సప్త గోవులతో పాటు మధ్యలోని శ్రీకృష్ణుని విగ్రహం కూడా తడిసిపోతున్న వైనాన్ని కథనంలో వివరించారు. దానికి దేవస్థానం అధికారులు స్పందించారు. శ్రీగోకులం పైకప్పుపై వెదురు చాపలు వేసి, వాటిపై వర్షం నీరు దిగువకు కారకుండా టార్పాలిన్ వేసి, ఆ పైన రెల్లుగడ్డి, దానిపై జీఐ ముళ్ల తీగను వేయాలని నిర్ణయించారు. ఇలా చేయడం వలన కోతులు శ్రీగోకులం పైకప్పు పైకి వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. ఇదే విషయాన్ని బుధవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.


