రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ యాప్‌ను రైతుల మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం చేయించాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) బొడ్డపాటి వెంకటేశ్వరరావు అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ యాప్ ద్వారా రైతులకు వాతావరణ సూచనలు అందుతాయని, యంత్ర పరికరాల పంపిణీ, యూరియా తదితర ఎరువుల పంపిణీ జరుగుతాయని తెలిపారు. విస్తరణ అధికారులు గ్రామ వ్యవసాయ సహాయకులను పర్యవేక్షిస్తూ పై అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అన్నదాతలకు వివిధ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారులు వేణుమాధవరావు, పీటర్, ప్రేమ్‌చంద్, రవికుమార్, ఎన్.శ్రీనివాస్ తదితరులు డీఏఓ వెంకటేశ్వరరావును సత్కరించారు.


