సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో మైనింగ్ మాఫియా బరి తెగిస్తోంది. కూటమిలోని ప్రధాన నేతలే మట్టి మాఫియా అవతారమెత్తి, చెరువులను చెరబడుతున్నారు. కొండలను కరిగించేస్తున్నారు. రేయింబవళ్లు అడ్డూ అదుపూ లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వి విక్రయించేస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. రాజానగరం నియోజకవర్గంలో తాగు, సాగునీటి చెరువులు, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలనే తేడా లేకుండా.. శ్రీమూడు టిప్పర్లు.. ఆరు లారీలుశ్రీ అన్న చందంగా ఈ అక్రమ దందా సాగుతోంది. ముఖ్యంగా కోరుకొండ మండలం గాడాల, జంబూపట్నం, కొత్త మునగాల, నిడిగట్ల గ్రామాల్లో చెరువులు, కోటికేశవరం, సీతానగరం మండలం నల్లగొండలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
నిబంధనలు చెరువులో తొక్కి..
ప్రభుత్వ స్థలాల్లో మట్టి తవ్వితే ప్రభుత్వ అభివృద్ధి పనులకు, ప్రజా అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కానీ, మట్టి మాఫియా ఈ నిబంధనలన్నింటినీ చెరువుల్లో తొక్కేస్తూ, దర్జాగా ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు విక్రయిస్తోంది. సాధారణంగా చెరువుల్లో మీటరు లోతు వరకూ మాత్రమే మట్టి తవ్వకాలు చేపట్టాలి. అది కూడా ఒక నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే తవ్వాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నారు. కొన్నిచోట్ల 10 నుంచి 15 అడుగుల లోతు వరకూ కూడా తవ్వేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అగాధాల్లా తవ్వేసి, మట్టి తరలించుకుపోతున్నారు. ఫలితంగా వర్షాలు కురిసి, ఈ చెరువుల్లో నీరు చేరితే పశువులు, మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. నిడిగట్లలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇక్కడ రాత్రి, పగలు అనే తేడా లేకుండా మట్టి తవ్వేస్తున్నారు. నిత్యం వందలాదిగా మట్టి లారీలు దూసుకుపోతూండటంతో రహదారులు దెబ్బ తింటున్నాయి. ఈ వాహనాలు రేపే దుమ్ము, ధూళి ఇళ్లలోకి చేరి, స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్న దుస్థితి నెలకొంది. దుమ్ము మరీ ఎక్కువగా ఉంటే తూతూమంత్రంగా రోడ్డుపై నీళ్లు జల్లి చేతులు దులుపుకొంటున్నారు. తిరిగి గంటల వ్యవధిలోనే దుమ్ము రేగిపోతోంది.
నెలకు రూ.60 కోట్లకు పైగా దోపిడీ?
నియోజకవర్గంలోని చెరువుల్లో తవ్వుతున్న నల్లరేగడి మట్టిని కడియం, ఆలమూరు, రావులపాలెం ప్రాంతాల్లోని ఇటుక బట్టీలు, భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లను ఎత్తు చేసేందుకు తరలిస్తున్నారు. ఎర్రమట్టి అయితే కడియం నర్సరీలకు తరలిస్తున్నారు. నల్లరేగడి, ఇసుక నేలల్లోని మట్టిని టిప్పర్‌కు రూ.10 వేలు, ఎర్ర మట్టి (గ్రావెల్) రూ.20 వేల నుంచి రూ.25 వేల చొప్పున అమ్ముకుంటున్నారు. సాధారణంగా రోడ్డు అభివృద్ధి పనుల్లో బెర్ములు (రోడ్డు అంచులు) ఎత్తు చేయడానికి ఎర్ర గ్రావెల్ వాడతారు. దీనిని కూడా మట్టి మాఫియా అవకాశంగా తీసుకుంటోంది. లారీ చెరువు మట్టిని రూ.3,500కు విక్రయిస్తున్నారు. ఈవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి రోజూ 500 లారీల మట్టి తరలిపోతోంది. ఈవిధంగా రోజుకు రూ.2 కోట్లకు పైగా, నెలకు సుమారు రూ.60 కోట్ల వరకూ అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నట్లు సమాచారం. ఇందులో ఎవరి వాటా తీసుకుంటున్నట్టు తెలిసింది.
కన్నెత్తి చూడని అధికారులు
కూటమి నేతలే గ్రావెల్ దందా సాగిస్తూండటంతో ఇరి గేషన్, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని లారీలకు అనుమతులు తీసుకున్నారు, ఎన్ని లారీలు తరలించారు, కాలువ గట్టుపై ఏ మేరకు తవ్వకాలు చేపట్టారు తదితర విషయాలు ఆరా తీయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు కాలువ గట్టునే కొల్లగొడుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది.
బరి తెగిస్తున్న మట్టి మాఫియా
అక్రమార్కుల చెరలో చెరువులు
ప్రతి రోజూ వందల లారీల్లో
అక్రమ రవాణా
రూ.కోట్లు దండుకుంటున్న
కూటమి నేతలు


