పేపరు మిల్లు కార్మికుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పేపరు మిల్లు కార్మికుల ఆందోళన

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

అక్రమ లాకౌట్‌పై ఆవేదన

కార్మిక శాఖ కార్యాలయంలో చర్చలు

కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని ఏపీ పేపర్‌ మిల్లుకు యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించడంతో మిల్లు వద్ద పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు శనివారం కూడా ఆందోళన కొనసాగించారు. యాజమాన్యం, అధికారులతో మిల్లులోని ఐదు యూనియన్లకు సంబంధించిన 8 మంది జేఏసీ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. తమకు ఎటువంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా యాజమాన్యం అర్ధరాత్రి అక్రమంగా లాకౌట్‌ ప్రకటించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు తక్షణం కొత్త వేతన ఒప్పందం అమలు చేయాలనే డిమాండుతో కాంట్రాక్టు కార్మికులు ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. వారితో శనివారం చర్చలు జరుగుతాయని ప్రకటించిన యాజమాన్యం, మరోవైపు లాకౌట్‌ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో ఉండటంతో మిల్లు కార్యకలాపాలు నిలిచిపోకూడదనే ఉద్దేశంతో తామంతా ఓవర్‌ టైమ్‌ కూడా పని చేశామని, అయినప్పటికీ లాకౌట్‌ ప్రకటించడం దారుణమని పలువురు పర్మినెంటు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా లాకౌట్‌ ప్రకటించి, తమను అన్యాయంగా గేటు బయటే నిలిపివేయడంతో భవిష్యత్తు కార్యాచరణపై మిల్లు వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో శనివారం ఉదయం నుంచీ కార్మికులు చర్చల్లో పాల్గొన్నారు. కాగా, కలెక్టరేట్‌లోని కార్మిక శాఖ అధికారుల ముందు లేబర్‌ కాంట్రాక్టర్లు, యాజమాన్యం మధ్య శనివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తిరిగి సోమవారం ఈ చర్చలు జరగనున్నాయి. కాంట్రాక్టు కార్మికులు లేకుండానే చర్చలు జరగడం గమనార్హం. మరోవైపు జేఏసీలో చురుకుగా ఉంటున్న 10 మంది కార్మికులకు యాజమాన్యం సస్పెన్షన్‌ నోటీసులు కూడా ఇచ్చింది. తద్వారా కార్మికుల ఐక్యతను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరిస్తూ తమను బానిసల మాదిరిగా భావిస్తోందని ఆవేదన చెందుతున్నారు. మిల్లు గేటు వద్ద కడియం సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన ఎస్సైలు నాగదుర్గాప్రసాద్‌, ప్రసన్నలు తమ సిబ్బందితో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement