హుందా మరచి.. దూషణల పంథా | - | Sakshi
Sakshi News home page

హుందా మరచి.. దూషణల పంథా

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

సాక్షి, రాజమహేంద్రవరం: వ్యక్తిగత ప్రయోజనమో.. సొంత అజెండాయో.. అధినాయకుల మెప్పు కోసమో.. పదవీ లాలసో తెలీదు కానీ.. కొన్నాళ్లుగా రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. విపక్ష నాయకులపై దూషణల పంథా పట్టారు. సినిమాల్లో ప్రతినాయకుల మాదిరిగా ‘చంపుతా.. నరుకుతా..’ అంటూ శివాలెత్తిపోతున్నారు. సభ్యతను పూర్తిగా పక్కన పెట్టేసి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులపై దిగజారుడు వ్యాఖ్యలకు దిగుతున్నారు. అధికారంలో ఉన్న నాయకులు ప్రతిపక్ష నేతలను విమర్శిస్తూంటారు. కానీ, ఆ విమర్శలు, ఆరోపణలు విధానపరమైన అంశాలకు పరిమితమైతే ఫర్వాలేదు. కానీ, బుచ్చయ్య మాత్రం తరచుగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మాజీ సీఎం అనే కనీస గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లు దూషణలకు దిగడం ఆయనకు పరిపాటిగా మారుతోంది. విలేకర్ల సమావేశాలు, టీవీ డిబేట్లలో పదేపదే అవే విమర్శలు చేస్తూ తన రాజకీయ అనుభవానికి సమాధి కట్టుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధినేతల మెప్పు

కోసమేనా?

టీడీపీ మహానాడు అనంతరం చంద్రబాబు ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ సందర్భంగా కొందరు మంత్రులకు ఉద్వాసన పలకనున్నారని తెలుస్తోంది. వారి స్థానంలో సీనియర్లకు మంత్రి పదవులిచ్చి, మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీని విమర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ రాయేస్తే పోలా.. అనే రీతిలోనే బుచ్చయ్య ఇలా రెచ్చిపోతున్నారని అంటున్నారు. మాజీ సీఎం జగన్‌ను, వైఎస్సార్‌ సీపీని గట్టిగా విమర్శిస్తే తనకు బెర్త్‌ ఖాయమవుతుందని భావించారో.. ఏమో కానీ కొన్ని నెలలుగా ఎన్నడూ లేని విధంగా దారుణమైన దూషణలకు దిగుతున్నారు. విజయవాడలో ప్రెస్‌మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. తద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని విశ్లేషకులు అంటున్నారు.

స్వపక్షంలో అవమానాలు మర్చిపోయారా?

సీనియర్‌ నేత అయినప్పటికీ టీడీపీలో బుచ్చయ్య చౌదరి ఆది నుంచీ అవమానాలే ఎదుర్కొంటున్నారు. దివంగత ఎన్టీఆర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో బుచ్చయ్య ఎన్టీఆర్‌ వర్గంలోనే ఉన్నారు. తనకు అన్యాయం జరిగితే అధినాయకత్వాన్నే ప్రశ్నించే తత్వం ఆయన సొంతం. ఆయన వ్యవహార శైలిని చంద్రబాబు జీర్ణించుకునే వారు కాదు. ఇష్టం లేకపోయినా పార్టీలో సీనియర్‌ అనే కారణంగా పట్టించుకోకుండా వదిలేసేవారు. టీడీపీపై ఉన్న అభిమానంతో గోరంట్ల సైతం పార్టీలో అలాగే కొనసాగేవారు. మంత్రి పదవి రాని సమయంలో ‘పార్టీలో పదవులు అమ్ముకుంటున్నార’ని గతంలో తీవ్ర స్థాయిలో ఆరోపించారు కూడా. ఈ నేపథ్యంలో ఆయనను చంద్రబాబు పెద్దగా నమ్మరనే ప్రచారం ఉంది. అందువల్లనే చంద్రబాబు ప్రభుత్వంలో బుచ్చయ్యకు మంత్రి పదవి దక్కలేదని అంటారు. తనను అంతగా అవమానించినప్పటికీ.. ఇప్పటికీ వారినే పొగడటం, మాజీ సీఎంను దూషించడం వంటివన్నీ మంత్రి పదవి కోసమేననే అభిప్రాయాన్ని కలిగించక మానవు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి

మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

నరికేస్తాం

‘ఏంట్రా యదవల్లారా మీరు నరికేది.. మేమే నరకగలం.. మాకు అధికారం ఉంది.. మేం తలుచుకుంటే మిమ్మల్ని నరికేయగలం.. కానీ, శాంతియుతంగా ముందుకు వెళ్తాం.. పిచ్చిపిచ్చి పేలాపనలు పేలితే అంబటి అయినా గిమ్మటి అయినా గుమ్మటం

పట్టించేస్తాం.. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నేత అంబటి రాంబాబును టార్గెట్‌ చేస్తూ బుచ్చయ్య చౌదరి తాజాగా వ్యాఖ్యలు చేశారు.

చంపితే తప్పేముంది?

‘నువ్వు ఓ సైకో.. నీకు ఉరి వేయక సన్మానాలు చేయాలా? నీ తల ఎందుకు తీయకూడదు? నిన్ను చంపితే తప్పేముంది? ఉరి తీసినా తప్పు లేదు?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ గతంలో పత్రికా సమావేశాలు, టీవీ డిబేట్లలో బుచ్చయ్య ఊగిపోతూ మాట్లాడారు. ఆయన దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్‌ నేత. అటువంటి నాయకుడు ఎంతో హుందాగా.. కొత్త తరానికి స్ఫూర్తిగా ఉండాలి. కానీ, ఆయనే సభ్యసమాజం తలదించుకునే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నా.. పార్టీ అధిష్టానం కనీసం పట్టించుకోకపోవడం చూస్తూంటే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

సభ్య సమాజం తలదించుకునేలా బుచ్చయ్య తీరు

‘నిన్ను చంపితే తప్పేముంది?’ అంటూ మాజీ సీఎంపై గతంలో శివాలు

సభ్యత వదిలి తాజాగా ‘నరుకుడు’ వ్యాఖ్యలు

రూరల్‌ ఎమ్మెల్యే తీరుపై

సర్వత్రా నిరసనలు

వైఎస్సార్‌ సీపీ నేతలు గరంగరం

బుచ్చయ్య చౌదరి దూషణలపై వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడుతున్నారు. మహిళలను కించపరుస్తూ ఏబీఎన్‌ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఉద్యమించిన విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ మాజీ సీఎంపై దూషణలకు దిగడంపై వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి పదవి కోసమే బుచ్చయ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వయసును, అనుభవాన్ని పక్కన పెట్టి మరీ మత్రి భ్రమించి దూషిస్తున్నారని ఆ పార్టీ నేతలు జక్కంపూడి రాజా, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్‌రామ్‌ తదితరులు ఆరోపిస్తున్నారు. ‘నరుకుతామంటున్నారు. ఎక్కడి రావాలో టైమ్‌, డేట్‌ చెప్పాలంటూ సవాల్‌ విసురుతున్నారు. మంత్రి పదవి కోసం ‘నరుకుతా, చంపుతా, ఉరి తీయాలి’ మాట్లాడటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది పోయి.. ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దూషణలు తగవని హెచ్చరిస్తున్నారు. బుచ్చయ్య తీరు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement