● ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు
● పీజీఆర్‌ఎస్‌లో 5 సమస్యలపై
మాజీ ఎంపీ భరత్‌రామ్ ఫిర్యాదు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కేవలం తమ జేబులు నింపుకోవడంలోనే కూటమి ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి చూపుతున్నారని, వారికి ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టడం లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ విమర్శించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 5 సమస్యలపై ఆయన అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇష్టానుసారం ఇసుక రవాణా చేస్తూండటంతో మల్లయ్యపేట ప్రాంతం దుమ్ము, ధూళితో నిండిపోయి, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇసుక లారీలు నగరంలోకి రాకుండా గోదావరి గట్టు వెంబడి మాత్రమే వెళ్లేలా చూడాలని కోరారు. గోరక్షణ పేట రోడ్డు తక్షణం వేయాలని విజ్ఞప్తి చేశారు. తన హయాంలో నిర్మించిన మోరంపూడి ఫ్లై ఓవర్ వంతెనకు రెండేళ్లు దాటినా కూటమి ప్రభుత్వం సర్వీస్ రోడ్లు వేయలేదని, దీనివలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే, పుష్కర్ ఘాట్‌లో తాజాగా వేసిన టైల్స్ వల్ల ప్రజలు జారిపోతున్నారని వాటిని మార్చాలని కోరారు. గోకవరం బస్టాండ్ సమీపాన గౌతమి సూపర్ బజార్ భవనాన్ని ప్లానుకు విరుద్ధంగా నిర్మించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం భరత్‌రామ్ మీడియాతో మాట్లాడుతూ, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమం విషయంలో పోటీ పడే వారని, కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలందరూ జేబులు నింపుకోవడానికే పరుగులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు ఇసుక అక్రమ రవాణా, మరోవైపు మద్యం మాఫియా, ఇంకో పక్కన కొండలు తవ్వేస్తూ ఒక్కో ఎమ్మెల్యే తక్కువలో తక్కువ నెలకు రూ.2 కోట్ల పైనే సంపాదిస్తున్నారని ఆరోపించారు.
దోచుకుని పంచుకుంటున్నారు
కోటిలింగాల ఘాట్ సమీపాన ఉన్న గామన్ బ్రిడ్జికి ఒకవైపు సిటీ ఎమ్మెల్యే, మరోవైపు రూరల్ ఎమ్మెల్యే పంచుకొని దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కొత్త సమస్యలు తెచ్చిపెట్టారని, మల్లయ్యపేట వాసుల బాధలు వర్ణనాతీతమని అన్నారు. ఇప్పటికే చాలామంది వ్యాపారాలు మూసుకున్నారని, ఆరోగ్యాలు కూడా పాడైపోయాయని చెప్పారు. రాజమండ్రి సిటీలో రాజకీయాలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. పేకాట క్లబ్బులు నడిపే వ్యక్తిని ఒక ఆలయ చైర్మన్‌గా, రౌడీ షీటర్‌ను మరో సత్రానికి చైర్మన్‌గా, ఇసుక దోపిడీ చేసే వ్యక్తిని విద్యాబుద్ధులు నేర్పే హితకారిణి సమాజం చైర్మన్‌గా, మద్యం సిండికేట్ నడిపే వ్యక్తికి పార్టీ అధ్యక్షుడిగా నియమించి ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 35 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, కనీసం వారు ఇళ్లు కట్టుకోవడానికి ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పీఎంఏవై కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని నిలదీశారు. ఈ విషయాలను ప్రజలు గమనించి, ఇలాంటి పాలకులకు బుద్ధి చెప్పాలని భరత్‌రామ్ విజ్ఞప్తి చేశారు.


