హత్యకేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నిందితుడి అరెస్టు

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

కోరుకొండ: సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన కోట నూకరాజును ఈ నెల 13వ తేదీన తన భార్య సుబ్బలక్ష్మిని హత్య చేసిన ఘటనలో సోమవారం అరెస్టు చేసి, రిమాండ్‌ నిమిత్తం సెంట్రల్‌ జైలుకు పంపినట్టు కోరుకొండ సీఐ ఎస్‌వీవీవీ మూర్తి తెలిపారు. ఆయన కార్యాలయంలో విలేకరులకు ఈ విషయాన్ని వెల్ల డించారు. నిందితుడి కోడలు చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుడు నూకరాజుకు కొడుకు, కూతురు ఉన్నారు. వీరంతా రఘుదేవపురంలోని చింతాలమ్మగుడి వీధిలోని పెందుర్తి రామన్న ఇంట్లో అద్దెకుంటున్నారు. కొడుకు శ్రీనివాస్‌ గుండె సంబంధిత అనారోగ సమస్యతో మార్చి నెల 28వ తేదీన మృతిచెందాడు. దీంతో అతని ఇద్దరు కుమార్తెలు, కోడలు, భార్యను మోపెడ్‌బండిపై ఊరూ రా తిరుగుతూ దుస్తుల వ్యాపారం చేసి పోషిస్తున్నాడు. కొడుకు మృతికి సంబంధించి కీడుబట్టలు తీసుకోవడానికి కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని భార్య బంధువులింటికెళ్లాడు. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత భార్యతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. కోడలు చంద్రకళ మనమరాళ్లను పోషించుకుంటుందని భార్య (మృతురాలు) భరోసా ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో తీవ్రావేశంతో కూరగాయలు కట్‌చేసే చాకుతో తన భార్య మెడ కోసి చంపేశాడు. అత్తమ్మ అరుపులకు కోడలు చంద్రకళ కిటికీ తలుపులు తీసి, చూడగా ఆమె (మృతురాలి) గుండెలపై నిందితుడు కూర్చుని ఉండడం చూసింది. తలుపులు తీయండీ, అత్తమ్మను విడిచిపెట్టండని కేకలు పెట్టినా తీయకుండా, నూకరాజు మెడపై కోసుకున్నట్టు తెలిపింది. గాయంతో ఉన్న నూకరాజును స్థానికుల సహకారంతో అంబులెన్స్‌ ద్వారా రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించినట్టు తెలిపారు. చికిత్స అనంతరం నిందితుడు నూకరాజును అరెస్టు చేశామన్నారు. ఎస్పీ నరసింహకిశోర్‌, నార్త్‌జోన్‌ డీఎస్పీ సీహెచ్‌ జీవన ఆదేశాల మేరకు సోమవారం అరెస్టు చేశామన్నారు. సీతానగరం పోలీసుస్టేషన్‌ ఎస్సై వినయ్‌ప్రతాప్‌ కేసు నమోదు చేసినట్టు సీఐ మూర్తి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement