దేవరపల్లి: దేవరపల్లి నుంచి ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై సోమవారం నుంచి టోల్ ఫీజు వసూలు ప్రారంభించారు. దాదాపు 20 రోజుల నుంచి హైవేపై వాహనాల రాకపోకలకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దీంతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు హైవేపై రాకపోకలు సాగిస్తున్నాయి. ట్రయల్ రన్ కావడంతో ఇంత వరకు వాహనదారుల నుంచి ఎటువంటి టోల్ ఫీజు వసూలు చేయలేదు. ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని సోమవారం (33వ కిలో మీటరు) గ్రామం వద్ద నుంచి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం(149వ కిలో మీటరు) వరకు మధ్యలో గల ఏడు టోల్ ఫ్లాజాల ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్టు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీ బి.కృష్ణమూర్తి తెలిపారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల హైవేపై 11 టోల్ ఫ్లాజాలు ఉండగా, ప్రస్తుతం ఏడు టోల్ ఫ్లాజాల ద్వారా ఫీజు వసూలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. నగదు రహిత వసూలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరపాలన్నారు. తెలంగాణలో కొంత వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, జంగారెడ్డిగూడెం–దేవరపల్లి మధ్య అక్కడడక్కడా చిన్నచిన్న పనులు జరుగుతున్నాయన్నారు. మే నెలలో పూర్తి స్థాయిలో టోల్ ఫీజు వసూలు జరుగుతుందన్నారు. హైవేపై మోటార్ సైకిళ్లు, ఆటోలకు అనుమతి లేదన్నారు.


