● మందకొడిగా వర్జీనియా కొనుగోళ్లు
● నామమాత్రంగా వేలం
● మార్కెట్‌కు రాని కొనుగోలుదారులు
● గిట్టుబాటు ధర కోసం రైతుల నిరీక్షణ
దేవరపల్లి: కొనుగోలుదారులు పూర్తి స్థాయిలో రాకపోవడం.. గిట్టుబాటు ధర దక్కకపోవడంతో పొగాకు అమ్మకాలు మందకొడిగా జరుగుతున్నాయి. రైతుల వద్ద సిద్ధంగా ఉన్న బేళ్లు ఇల్లు కదలనంటున్నాయి. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో 2025–26 పంట కాలంలో 12,612 మంది రైతులు సుమారు 29 వేల హెక్టార్లలో పొగాకు సాగు చేశారు. పంట ఆశాజనకంగా ఉండడంతో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. బోర్డు 49.32 మిలియన్ కిలోల ఉత్పత్తికి మాత్రమే అనుమతివ్వగా.. సుమారు 85 మిలియన్ కిలోల పొగాకు పండిందన్నది అంచనా. పంట క్యూరింగ్‌లు దాదాపు పూర్తి కావచ్చాయి. పొగాకు రంగు, నాణ్యత బాగుండటంతో మార్కెట్ కూడా అందుకు తగినట్టుగానే ఉంటుందని రైతులు ఆశించారు. కానీ, అందుకు భిన్నమైన పరిస్థితులు మార్కెట్లో ఎదురయ్యాయి.
తగ్గిన ప్రారంభ ధర
రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల్లో గత నెల 25న పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గత ఏడాది కొనుగోళ్ల ప్రారంభం రోజున కిలో పొగాకు గరిష్ట ధర రూ.290 దక్కగా.. ఈసారి తొలి రోజున అది రూ.265కే పరిమితమైంది. దీంతో, రైతులు కంగు తిన్నారు. గత ఏడాది ప్రారంభ ధరకంటే ఎంతో కొంత ఎక్కువగా ఇస్తారని, కనీసం గత ఏడాది ప్రారంభ ధర రూ.290 అయినా ఇస్తారని ఆశ పడగా.. అందుకు భిన్నంగా మార్కెట్ మొదలైంది. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర ఇస్తేనే వేలం జరగనివ్వాలనే నిర్ణయానికి రైతులు వచ్చారు. కిలో ప్రారంభ గరిష్ట ధర రూ.290 ఇవ్వాలని అధికారులను, కొనుగోలుదారులను డిమాండ్ చేశారు. గరిష్ట ధర రూ.265కు మించకుండా వ్యాపారులు సీలింగ్ పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరంభం రోజునే వేలం నిలుపు చేయడం మంచిది కాదని భావించిన రైతులు తొలి రోజు అదే ధరకు పొగాకు విక్రయించారు. అప్పటి నుంచీ రైతులు తక్కువ సంఖ్యలో బేళ్లను అమ్మకానికి తెస్తున్నారు.
నెల రోజులవుతున్నా..
సాధారణంగా వేలం ప్రారంభం రోజున శుభసూచకంగా ఒక్కో వేలం కేంద్రంలో 18 నుంచి 27 బేళ్లతో కొనుగోళ్లు ప్రారంభిస్తారు. అనంతరం, రోజుకు 300 నుంచి 400 బేళ్లు వేలం కేంద్రాలకు వస్తాయి. మార్కెట్ వేగం పుంజుకున్నాక ఆ సంఖ్య రోజుకు 700 నుంచి 1,200కు పెరుగుతుంది. ఈ ఏడాది కొనుగోళ్లు ప్రారంభమై దాదాపు నెల రోజులవుతున్నా మార్కెట్లో కొనుగోళ్లు మందకొడిగానే జరుగుతున్నాయి. ఒక్కో వేలం కేంద్రానికి 30 నుంచి 150 వరకూ మాత్రమే బేళ్లు అమ్మకానికి వస్తున్నాయి. వీటిలో దాదాపు సగం బేళ్లను వ్యాపారులు తిరస్కరిస్తున్నారు.
రోజు విడిచి రోజు వేలం
వేలం కేంద్రాలకు రైతులు తక్కువ సంఖ్యలో బేళ్లు తీసుకురావడం, కొనుగోలుదారులు మార్కెట్‌కు రాకపోవడం వంటి కారణాలతో అధికారులు ప్రస్తుతం రోజు విడిచి రోజు మాత్రమే వేలం నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలోని రెండు కేంద్రాల్లో ఒక రోజు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల్లో మరుసటి రోజు వేలం జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ వేలం ప్రక్రియ ఇలానే కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఐదు వేలం కేంద్రాల్లోనూ రోజుకు సుమారు 20 వేల కిలోల పొగాకు కొనుగోళ్లు మాత్రమే జరుగుతున్నాయి. కొనుగోళ్ల తీరుపై కౌలు, చిన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మార్కెట్ ఎలా ఉంటుందోనని మధనపడుతున్నారు.
జీఎస్టీ భారం.. యుద్ధం శాపం
పొగాకు ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీని 28 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. ఇది భారం కావడంతో వ్యాపారులు పొగాకు ధర పెంచడం లేదని అంటున్నారు. మరోవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కూడా పొగాకు మార్కెట్‌పై పడింది. మన ప్రాంత పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి గల్ఫ్‌తో పాటు చైనా, జపాన్ తదితర దేశాలకు వివిధ దేశాలకు పొగాకు ఎగుమతులు జరుగుతూంటాయి. యుద్ధం నేపథ్యంలో ఎగుమతి సంస్థలకు విదేశీ ఎగుమతుల ఆర్డర్లు ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. ఇది కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీనికి తోడు కర్ణాటకలో పొగాకు వేలం ఇంకా కొనసాగుతోంది. అక్కడ ఇంకా సుమారు 30 మిలియన్ కిలోల పొగాకు వేలం జరగాల్సి ఉంది. అక్కడ వేలం ముగిస్తేనే కానీ, కొనుగోలుదారులు ఇక్కడకు వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.
ఆర్డర్లు ఖరారు కాలేదు
కొనుగోలు సంస్థలకు ఎగుమతి ఆర్డర్లు ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. కర్ణాటకలో కొనుగోళ్లు జరుగుతూండటం, జీఎస్టీ, యుద్ధ ప్రభావం వంటి అనేక కారణాలతో పొగాకు కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి. మార్కెట్లో చాలా ఇబ్బందులున్నాయి. ఇప్పటి వరకూ రూ.10.57 కోట్ల విలువైన 4.05 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి.
– జె.సురేంద్ర కుమార్, టుబాకో బోర్డు
రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం
దేవరపల్లి వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లు
ఇప్పటి వరకు జరిగిన పొగాకు విక్రయాలు (కిలోల్లో)
వేలం కేంద్రం విక్రయాలు
దేవరపల్లి 45,706
జంగారెడ్డిగూడెం–1 1,05,688
జంగారెడ్డిగూడెం–2 1,19,027
కొయ్యలగూడెం 55,175
గోపాలపురం 79,547
మొత్తం 4,05,143
కిలో గరిష్ట ధర : రూ.265
కనిష్ట ధర : రూ.250
సగటు ధర : రూ.261


