కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసు

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

పెరవలి: జిల్లా కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసు జారీ చేసింది. వివరాలివీ.. మండలంలోని తీపర్రు గ్రామానికి చెందిన దళితులు తమకు శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలంటూ కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ సమస్యపై 2024లో అప్పటి కలెక్టర్‌ స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దళితుల శ్మశాన వాటికకు స్థలం చూపించాలని సూచించారు. అయినప్పటికీ వారి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో, గత నెలలో జిల్లాలో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానా దృష్టికి తీపర్రు దళితులు తమ సమస్యను తీసుకువెళ్లారు. ఆయన సూచన మేరకు జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఆ గ్రామానికి చెందిన గొల్ల ధనరాజ్‌ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరికి నోటీసు జారీ చేసింది. తీపర్రు దళితుల శ్మశాన వాటిక సమస్యపై 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక పంపించాలని ఆదేశించింది. నివేదిక ఇవ్వకపోతే స్వయంగా లేదా కలెక్టర్‌ ప్రతినిధి తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది.

నర్సరీలో మొక్కల నరికివేత

కడియం: మండలంలోని దామిరెడ్డిపల్లిలో సుమారు రూ.6 లక్షల విలువైన నర్సరీ మొక్కలను గుర్తు తెలియని దుండగులు నరికేశారు. గ్రామంలోని పోలేరమ్మ గుడి సమీపాన ఏడు కుంచాల చేనులో బాధితుడు, ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు విత్తనాల సాయికుమార్‌ కౌలు వ్యవసాయం చేస్తున్నారు. అందులో మిర్చి మేరీ గ్రీన్‌, పోక రకాలకు చెందిన 25 అంగుళాల బ్యాగు సైజు మొక్కలు పెంచుతున్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ నర్సరీలోకి చొరబడి మొక్కల మొవ్వులను నరికేశారు. మొత్తం మొక్కలన్నిటినీ ఇదే విధంగా చేయడంతో తనను నష్టపరచడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని సాయికుమార్‌ గ్రహించారు. దీనిపై కడియం పోలీసులకు ఈ నెల 14న ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను ఆయన ఆదివారం స్థానిక విలేకర్లకు వెల్లడించారు. తనకు ఎవ్వరితోనూ వివాదాలు లేవని, తనను ఇంతగా నష్టపరచాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అర్థం కావడం లేదని సాయికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

విశ్వనాథకు

ఋషిపీఠం పురస్కారం

రాజమహేంద్రవరం రూరల్‌: మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ ప్రతిష్ఠాత్మక ఋషిపీఠం పురస్కారం–2025కు ఎంపికయ్యారు. సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఏర్పాటయిన ఈ సంస్థ ప్రాచీన భారతీయ విద్యలను ప్రోత్సహించడానికి ఏటా ఈ పురస్కారం అందజేస్తోంది. ప్రముఖ వేద విద్వాంసుడు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత దివంగత విశ్వనాథ జగన్నాథ ఘనపాఠి తనయుడు గోపాలకృష్ణ సంప్రదాయ పద్ధతిలో వేదవేదాంగాలను అభ్యసించారు. రాజమహేంద్రవరం గౌతమీ విద్యాపీఠం, ఓరియెంటల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేశారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుంచి మహామహోపాధ్యాయ గౌరవ పురస్కారం, బెంగళూరుకు చెందిన సురభారతి సంస్కృత ప్రతిష్ఠానం నుంచి శాస్త్రరత్నాకర, అవధూత దత్తపీఠం నుంచి శాస్త్రనిధి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శాస్త్రవిద్వన్మణి బిరుదులు అందుకున్నారు. 2019లో రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. తండ్రీతనయులిద్దరూ రాష్ట్రపతి పురస్కారాలు అందుకోవడం విశేషం. హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్‌లో మే 9న జరిగే కార్యక్రమంలో సామవేదం చేతుల మీదుగా విశ్వనాథ ఋషిపీఠం పురస్కారం అందుకుంటారు. ఋషిపీఠం కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ టీవీ నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపారు.

రేపు పీఆర్‌టీయూ ధర్నా

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు చింతాడ ప్రదీప్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ ఏర్పాటు, డీవైఈఓ, ఎంఈఓ, జూనియర్‌ లెక్చరర్‌, పీజీటీల పదోన్నతులు కల్పించాలని, 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్‌సీ అమలు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, ఇంకా ఇతర సమస్యల పరిష్కారానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement