తుని రూరల్: లోవ దేవస్థానంలో వెలసిన తలుపులమ్మ అమ్మవారి సన్నిధికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన సుమారు 25 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,02,680, పూజా టికెట్లకు రూ.2,65,540, కేశఖండన శాలకు రూ.15,520, వాహన పూజలకు రూ.7,890, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.71,730, విరాళాలు రూ.43,929 కలిపి మొత్తం రూ.6,07,289 ఆదాయం సమకూరిందని వివరించారు.
సర్వేయర్ల నియామకానికి
దరఖాస్తుల ఆహ్వానం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పోలవరం జిల్లాల్లో 235 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకానికి దరఖాస్తులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ లోగా కాకినాడలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ నియామకానికి పూర్వ చరిత్ర ధ్రువీకరణ తప్పనిసరన్నారు. లైసెన్స్ రెన్యువల్ కాలపరిమితి మూడేళ్లుండగా, ఆధునిక సర్వే పరికరాలపై శిక్షణ పొందిన తరువాతే లైసెన్స్ జారీ చేస్తారని తెలిపారు. ప్రతి దరఖాస్తుకు రూ.750 ఫీజు నిర్ణయించారన్నారు. అవసరమైన పత్రాలతో పాటు పూర్వ చరిత్ర వివరాల కోసం అభ్యర్థులు మూడు సెట్ల ఫామ్‌లు భర్తీ చేసి సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు కాకినాడలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి బి.లక్ష్మీనారాయణను సంప్రదించాలని జేసీ సూచించారు.


