ఈ చట్టం.. శ్రమజీవికి చుట్టం! | - | Sakshi
Sakshi News home page

ఈ చట్టం.. శ్రమజీవికి చుట్టం!

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

భవితకు భద్రతనిస్తున్న ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం–2005

అవగాహన లేక ఎన్నో ప్రయోజనాలకు దూరం

వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్న అధికారులు

కాకినాడ క్రైం: భవన నిర్మాణ కార్మికుల బతుకులు ఇక భద్రం. ఆంధ్రప్రదేశ్‌ భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం–2005 వారి జీవితాలకు భరోసా కల్పిస్తోంది. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు తోడ్పాటుతో అధికారులు ఈ మేరకు అవగాహన కల్పిస్తున్నారు.

ఎవరి కోసం...

ఈ చట్టం కార్మికుల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుంది. భవన నిర్మాణ కార్మికులు, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న వారు, ఉపాధి హామీ కార్మికులు ఈ ప్రయోజనాలు అందిపుచ్చుకునేందుకు అర్హులు. ఏ అధికారితో అవసరం లేకుండా తాము భవన నిర్మాణ రంగం, అనుబంధ రంగాలకు చెందిన కార్మికులమని స్వీయ నిర్థారణ (సెల్ఫ్‌ డిక్లరేషన్‌) ఇస్తే చాలు.

పెళ్లికి కానుక..

కార్మికుడు లేదా కార్మికురాలికి వివాహానికి, కార్మికుల ఇళ్లలో ఆడపిల్లల వివాహాలకు రూ.20 వేలు సాయం అందుతుంది. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లలు ఉంటే రూ.40 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. ఏపీ సేవా పోర్టల్‌ ద్వారా వివాహ ధృవీకరణ పత్రం తీసుకుని, కార్మికుడి ఆధార్‌, రేషన్‌ కార్డుల నకళ్లు, బ్యాంక్‌ ఖాతా వివరాలతో స్థానిక కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. 2026 మార్చి తర్వాత జరిగిన వివాహాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

ప్రసవిస్తే..

కార్మికుడి కుమార్తె, లేదా భార్య లేదా మహిళా కార్మికురాలు ప్రసవిస్తే ప్రసూతి వైద్యం నిమిత్తం రూ.20 వేలు అందజేస్తారు. ఇందుకు ఆసుపత్రి ధృవపత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సాయం మొదటి రెండు కాన్పులకు అందుతుంది. గర్భధారణ మొదటి దశ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.

సహజ మరణానికి...

జనన మరణాల్లో కార్మికుడికి చట్టం తోడుంటుంది. మరణం వేళ రూ.60 వేల మొత్తాన్ని కార్మికుడు నిర్ణయించిన నామినీకి అందజేస్తుంది. ఈ సాయం కేవలం సహజ మరణానికే వర్తిస్తుంది.

అంతియాత్రలోనూ..

అంతిమ యాత్రలోనూ మృతుడి అంత్యక్రియలకు రూ.20 వేలు కుటుంబానికి ఇస్తారు. కార్మికుడి మృతి నిర్థారణ అయిన వెంటనే కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే ఈ సాయం తక్షణం అందజేస్తారు.

1.2 లక్షలకు పైగా నమోదు

కాకినాడ జిల్లాలో నమోదైన 1,20,530 మంది కార్మికులకు అధికారులు లేబర్‌ కార్డులు మంజూరు చేశారు. మరో 70 వేల మందికి పైగా నమోదు కావలసిన వారున్నారు.

కార్మికులకు ఎంతో భరోసా

భవన నిర్మాణ, అనుబంధ విభాగాల్లోని కార్మికులకు చట్టం ఎంతో భరోసా ఇస్తోంది. 90 రోజులు పనిచేసి ఉంటే చాలు. కేవలం ఏడాదికి రూ.12 రూపాయలు చొప్పున ఒకే సారి ఐదేళ్లకు రిజిస్ట్రేషన్‌ రుసుముతో కలిపి రూ.110 చెల్లిస్తే సరిపోతుంది. 24 గంటల వ్యవధిలోనే లేబర్‌ కార్డు మంజూరు చేస్తాం. కార్మికులు, సంఘ ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నాం. స్థానిక జీపీటీ రోడ్‌లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయంలో అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.

– పి.శ్రీనివాస మహేష్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, కాకినాడ జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement