ఫ చిన్న మార్పులతో చిన్నారుల్లో చైతన్యం
ఫ మొబైల్ ఫోన్లు, ఆన్‌లైన్ గేమ్స్ వద్దు
ఫ నీతి కథలు, మెదడుకు మేత పెట్టే
ఆటలవైపు దృష్టి మరల్చాలి
ఫ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరం
ఫ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
రాయవరం: పాఠశాలకు వేసవి సెలవులంటే విద్యార్థులకు అదో ఆట విడుపు. పుస్తకాలకు స్వస్తి చెప్పి ఆటపాటలకు అల్లర్లకు సిద్ధమైపోతుంటారు. గతంలో అయితే అమ్మమ్మ, లేదా నానమ్మల ఇళ్లకు వెళ్లి ఆత్మీయులతో సంతోషంగా గడపడం, వారు కథలు చెప్తుంటే శ్రద్ధగా వినడం, ఇంట్లో చిన్న చిన్న సాయాలు చేయడం ఇలా గడిచేవి రోజులు. కాలం మారింది. ఏ కుగ్రామానికి వెళ్లినా అక్కడ కావలసినంత ఇంటర్నెట్, దానిని వాడుకోడానికి ఓ స్మార్ట్‌ఫోన్. ఇవి చాలవా వేసవి ఇట్టే గడిచిపోవడానికి. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి ఇష్టమైన అంశాల్లో వారి ప్రతిభను గుర్తించి మెరుగైన శిక్షణ ఇప్పిస్తే వారు దేశానికి విలువైన సంపదగా మారతారనడంలో సందేహం లేదు. వారిళ్లలో పెద్దలు వారికి కుటుంబ విలువలు, నైతిక విలువలు నేర్పే చిన్నయ సూరి నీతి చంద్రికలోని కథలు, లేదా దేశభక్తిని పెంపొందించే స్వాతంత్య్ర సమరయోధుల కథలను, శాస్త్రవేత్తల బయోగ్రఫీలను, పురాణేతిహాసాలను వారికి కథలు కథలుగా చెప్పవచ్చు. తద్వారా వారిని విలువలతో కూడిన రేపటి పౌరులవుతారనడంలో అతిశయోక్తి లేదు.
బాల్యం..అమూల్యం:
నాటి చిన్నారులకు పల్లెల్లోని చేలగట్ల పైన, పంటబోదెలలోను, చెట్ల కొమ్మలపై ఆడే పల్లె పట్టు ఆటలు ఆడేవారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో కోతికొమ్మచ్చి, గోటిబిళ్ల, గోళీకాయలు, అష్టాచమ్మా, బిళ్లపెంకుల ఆటలు, వంగుదూకుళ్లు, దొంగాట వంటి ఆటలు ఆడేవారు. తద్వారా వారిలో శారీరక శ్రమ అలవడి, తద్వారా మేథోమధనం జరిగి నిత్య నూతన చైతన్యంతో ఉండేవారు. అదే ఒరవడిని నేటి పిల్లలకు తల్లిదండ్రులు అలవరచాలి.
ఆత్మస్థైర్యం నింపాలి
చిన్నారులలో ఆత్మస్థైర్యం పెంపొందే దిశగా కరాటే, యోగా, ధ్యానం తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించాలి. సమీపంలోని అనాథ ఆశ్రమాలకు తీసుకుని వెళ్లి అక్కడి చిన్నారులలో మాట్లాడించడం, అక్కడి పరిసరాలపై అవగాహన కల్పించడం ద్వారా మానవత్వ విలువలు అలవడతాయి. చిన్నతనం నుంచే వారిలో పొదుపు అలవాటు చేయడంద్వారా ఆర్థిక అంశాల నిర్వహణ అలవాటు చేయవచ్చు.
ఆరోగ్యంపైనా అవగాహన
సెలవుల్లో ఆటలకు వెళ్లి అపరిశుభ్రంగా తిరిగి వస్తుంటారు. ఆ సమయంలో వారు ఎటువంటి రోగాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరాన్ని ఏ విధంగా శుభ్రంగా చేసుకోవాలో వివరంగా చెప్పాలి.
6.2 లక్షల మంది విద్యార్థులు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,190 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని సుమారు 6.2 లక్షల మంది విద్యార్థులు సుమారు 50 రోజుల పాటు వేసవి సెలవులను గడపనున్నారు.


